దేశవ్యాప్తంగా ఉచిత వైఫై…కేంద్ర కేబినెట్ ఆమోదం

Cabinet gives nod దేశంలో భారీ వైఫై నెట్ వర్క్ ని లాంఛ్ చేయాలన్న కేంద్రం ఫ్లాన్ కు బుధవారం(డిసెంబర్-9,2020)కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. పబ్లిక్ డేటా ఆఫీసుల నుంచి ఎటువంటి లైసెన్స్ ఫీజు వసూలు చేయకుండా వాటి ద్వారా దేశవ్యాప్తంగా ప్రజలకు ఉచితంగా వైఫై సేవలు అందించడం కోసం పబ్లిక్ వైఫై నెట్ వర్క్స్ ను ఏర్పాటు చేసేందుకు ఇవాళ ప్రధానమంత్రి నరేంద్రమోడీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దీనిని పబ్లిక్ వైఫై యాక్సెస్ నెట్ వర్క్ ఇంటర్ పేస్ పీఎం వాణిగా పిలుస్తారు.
కేబినెట్ భేటీ అనంతరం కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ మాట్లాడుతూ… దేశంలో భారీ వైఫై నెట్ వర్క్ ని వదిలేందుకు పీఎం-వైఫై యాక్సెస్ నెట్ వర్క్ ఇంటర్ ఫేస్(PM-WANI)ని లాంఛ్ చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దేశంలో పబ్లిక్ డేటా సెంటర్లు ప్రారంభిస్తాం. దానికి ఎటువంటి లైసెన్స్,ఫీజు లేదా రిజిస్ట్రేషన్ ఉండదు అని రవిశంకర్ ప్రసాద్ తెలిపారు.దేశంలో పబ్లిక్ వైఫై నెట్ వర్క్ లను వృద్ధి చేసేందుకు పీఎం వాణి ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు.
మరోవైపు, కొచ్చి-లక్షద్వీప్ మధ్య జలాంతర్గామి ఆప్టికల్ ఫైబర్ కేబుల్ కనెక్టివిటీ ఏర్పాటు చేయడానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈశాన్య ప్రాంతానికి సమగ్ర టెలికాం అభివృద్ధి ప్రణాళిక ప్రకారం అరుణాచల్ ప్రదేశ్, అస్సాంలోని రెండు జిల్లాల్లో మొబైల్ కవరేజ్ అందించేందుకు USOF పథకానికి కూడా కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. గుర్తించిన 2374 గ్రామాలకు కూడా మొబైల్ కవరేజ్ అందించడమే ఈ ప్రాజెక్ట్ ఉద్దేశ్యం.
ఆత్మ నిర్భర్ భారత్ రోజ్ గార్ యోజన కింద ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రూ. 1548 కోట్లను కేటాయించేందుకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. ఆత్మ నిర్భర్ భారత్ రోజ్ గార్ యోజన కింద పథకం మొత్తం కాలానికి రూ. 22,810 కోట్లు..అంటే 2020-2023 ఏళ్ళ మధ్య సుమారు 58.5 లక్షల మంది ఉద్యోగులకు దీనివల్ల ప్రయోజనం కలుగుతుందని అంచనా వేశారు.
ఆత్మ నిర్భర్ భారత్ రోజ్ గార్ యోజన పథకంలోని ముఖ్య అంశాలు
-2020 అక్టోబరు 1 కి ముందు, లేదా ఆ తరువాత 2021 జూన్ 30 వరకు నియమితులైన కొత్త ఉద్యోగులకు రెండేళ్ల పాటు ప్రభుత్వం సబ్సిడీనిస్తుంది.
-1000మంది ఉద్యోగుల లోపు ఉన్న సంస్థలలో కొత్తవారికి ఈపీఎఫ్ (ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్) కు సంబంధించి ప్రభుత్వం 12 శాతం ఉద్యోగుల కాంట్రిబ్యూషన్ ని, సంస్థ యాజమాన్యం నుంచి ఇంతే కాంట్రిబ్యూషన్ ని చెల్లిస్తుంది.
-1000 మందికి పైగా ఉద్యోగులున్న సంస్థల్లో రెండేళ్ల పాటు కొత్తవారికి ప్రభుత్వం.. వారి ఈపీఎఫ్ కాంట్రిబ్యూషన్ లో 12 శాతం మాత్రమే చెల్లిస్తుంది.
-నెలకు 15 వేల రూపాయల లోపు వేతనం పొందుతున్నవారిలో..ఈపీఎఫ్ఓ కింద రిజిస్టర్ అయిన సంస్థలో ఈ ఏడాది అక్టోబరు 1 కి ముందు ఉద్యోగం చేస్తూ యూనివర్సల్ అకౌంట్ నెంబరు గానీ, ఈపీ ఎఫ్ మెంబర్ అకౌంట్ గానీ లేకుండా ఉంటే వారికీ ఈ ప్రయోజనం కలుగుతుంది.