భర్తను హత్య చేసి.. హోంమంత్రికి లేఖ రాసిన మహిళ

  • Published By: veegamteam ,Published On : December 25, 2019 / 04:20 AM IST
భర్తను హత్య చేసి.. హోంమంత్రికి లేఖ రాసిన మహిళ

Updated On : December 25, 2019 / 4:20 AM IST

నా భర్తను రెండేళ్ల క్రితం నేనే హత్య చేశాను..నాకు శిక్ష విధించండి అంటూ హర్యానా రాష్ట్రానికి చెందిన ఓ మహిళ జనతాదర్బార్‌లో సాక్షాత్తూ హర్యానా హోంశాఖ మంత్రి అనిల్ విజ్‌కు కన్నీళ్లతో ఓ లేఖ అందించింది. ఈ ఘటన స్థానికంగా పెను  సంచలనం కలిగించింది. 

తీవ్ర మనోవేదనతో విలపిస్తున్న సదరు మహిళను చూసి ఆమె ఇచ్చిన లెటరు చూసిన హోంమంత్రి అనిల్ విజ్ షాక్ అయ్యారు. కొద్ది సేపటికి షాక్ నుంచి తేరుకున్న మంత్రి అనిల్ విజ్ భర్తను హతమార్చానని చెప్పిన మహిళను పోలీసులకు అప్పగించారు. 

ఈ ఘటనపై సదరు మహిళ వద్ద వివరాలు తీసుకుని కేసు నమోదు చేసిన పోలీసులు ఆమెను స్టేషన్ కు తీసుకువెళ్లి దర్యాప్తు ప్రారంభించారు. తన భర్తను తానే హత్య చేశానని వివాహిత రాతపూర్వకంగా అంగీకరించడంతో తాము ఆమెపై హత్య కేసు నమోదు చేశామని పోలీసు అధికారి సతీష్ కుమార్ చెప్పారు. భర్తను వివాహిత ఎందుకు హత్య చేసిందనే విషయంపై తాము దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెప్పారు.

కాగా..ఆమె భర్తను ఎందుకు చంపాల్సి వచ్చిందో..హత్య చేసిన రెండేళ్లకు ఈ విషయాన్ని ఎందుకు బైటపెట్టాల్సి వచ్చిందో..రెండేళ్ల క్రితం జరిగిన ఈ హత్య పోలీసులు దృష్టికి ఎందుకు రాలేదు? అనే అంశాలపై పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు.