కేజ్రీవాల్ సతీమణికి సంఘీభావం ప్రకటించిన హేమంత్ సోరెన్ భార్య

జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ భార్య కల్పనా సోరెన్.. ఢిల్లీలో కేజ్రీవాల్ సతీమణి సునీతను కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది.

కేజ్రీవాల్ సతీమణికి సంఘీభావం ప్రకటించిన హేమంత్ సోరెన్ భార్య

Kalpana Soren Meet Sunita Kejriwal: జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ భార్య కల్పనా సోరెన్ శనివారం ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సతీమణి సునీతను కలిశారు. ఢిల్లీలోని ముఖ్యమంత్రి నివాసానికి వచ్చిన కల్పనా సోరెన్.. సునీతా కేజ్రీవాల్‌ను కలిసి సంఘీభావం ప్రకటించారు. ఆమెను ఆత్మీయ ఆలింగనం చేసుకుని మద్దతు ప్రకటించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన అరవింద్ కేజ్రీవాల్ ప్రస్తుతం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కస్టడీలో ఉన్నారు. ఈ నేపథ్యంలో సునీతా కేజ్రీవాల్‌తో కల్పనా సోరెన్ భేటీ కావడం ప్రాధానం సంతరించుకుంది.

కాగా, కష్టకాలంలో సునీతా కేజ్రీవాల్‌కు అండగా నిలబడేందుకే ఆమెను కలిసినట్టు కల్పనా సోరెన్ ఎక్స్‌ పోస్ట్‌లో వెల్లడించారు. “అరవింద్ కేజ్రీవాల్ జీ భార్య సునీతా కేజ్రీవాల్ జీతో మాట్లాడి ధైర్యం చెప్పడానికి ప్రయత్నించాను. స్నేహితురాలిగా వారి సమస్యలను నేను అర్థం చేసుకోగలను. ప్రముఖ ముఖ్యమంత్రులను సార్వత్రిక ఎన్నికలకు షెడ్యూల్ వెలువడిన సందర్భంలో అక్రమంగా అరెస్ట్ చేయడం ప్రజాస్వామ్య దేశంలో మామూలు విషయం కాదు. ఈ సంక్షోభ సమయంలో హేమంత్ సోరెన్ జీ నాయకత్వంలో మొత్తం జార్ఖండ్ కేజ్రీవాల్ జీకి అండగా నిలుస్తుంది. భారతదేశం తలవంచద”ని కల్పనా సోరెన్ ఎక్స్‌లో పోస్ట్‌లో పేర్కొన్నారు.

Also Read: సునీతా కేజ్రీవాల్ మరో రబ్రీదేవి కాబోతున్నారా? పార్టీని, ఢిల్లీ పీఠాన్ని నడిపించే నారీ శక్తి ఆమేనా?

ఈ వీడియో చూస్తే బీజేపీ భయపడాల్సిందే..
సునీతా కేజ్రీవాల్‌ను కల్పనా సోరెన్ కలిసిన వీడియోను ఢిల్లీ మంత్రి అతిషి ఎక్స్‌లో షేర్ చేశారు. ఈ వీడియో చూసి బీజేపీ భయపడుతుందని కామెంట్ చేశారు. “ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వాలకు సారథ్యం వహిస్తున్న తమ భర్తలపై కేంద్ర దర్యాప్తు సంస్థలు చూపిస్తున్న క్రూర ప్రతాపానికి బెదిరిపోని ఇద్దరు బలమైన మహిళల ఈ వీడియో చూస్తే బీజేపీ భయపడాల్సిందే”నని పేర్కొన్నారు.