Women’s Reservation Bill : రాజ్యసభలోనూ మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం.. అనుకూలంగా ఎన్ని ఓట్లు పడ్డాయంటే
ఉభయ సభల ఆమోదం పొందిన ఈ బిల్లును రాష్ట్రపతి ఆమోదానికి కేంద్రం పంపనుంది. రాష్ట్రపతి ఆమోదిస్తే బిల్లు చట్టంగా మారుతుంది. Women's Reservation Bill

Women's Reservation Bill Passed
Women’s Reservation Bill Passed : చట్టసభల్లో(లోక్ సభ, అసెంబ్లీలలో) మహిళలకు 33శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు కేంద్రం తీసుకొచ్చిన మహిళా రిజర్వేషన్ బిల్లుకు రాజ్యసభలోనూ ఆమోదం లభించింది. డిజిటల్ డివైజ్ ద్వారా జరిగిన ఓటింగ్ లో సభ్యులు ఏకపక్షంగా బిల్లుకు అంగీకారం తెలిపారు. 171 మంది సభ్యులు బిల్లుకు అనుకూలంగా ఓటు వేశారు.
ఇప్పటికే లోక్ సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు పొందగా, ఇప్పుడు రాజ్యసభలోనూ ఆమోదం పొందింది. దీంతో ఈ బిల్లుకు పార్లమెంటు ఆమోదం దక్కినట్లు అయ్యింది. పార్లమెంటు ఉభయసభలు ఈ బిల్లుకు ఆమోద ముద్ర వేయగా.. ఇక చివరి అంకం మాత్రమే మిగిలుంది. ఈ బిల్లును రాష్ట్రపతి వద్దకు పంపించనున్నారు. రాష్ట్రపతి ఆమోదంతో మహిళా రిజర్వేషన్ల బిల్లు మహిళా రిజర్వేషన్ల చట్టంగా మారనుంది.
నారీ శక్తి వందన్ అధినియమ్ పేరుతో కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఈ చరిత్రాత్మక బిల్లును గురువారం(సెప్టెంబర్ 21) రాజ్యసభలో ప్రవేశపెట్టారు. దీనిపై సుదీర్ఘంగా చర్చ జరిగింది. అనంతరం ఓటింగ్ నిర్వహించగా.. సభలోని సభ్యులంతా మద్దతుగా ఓటు వేశారు.
ఉభయ సభల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందడంపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ఈ బిల్లుకు మద్దతిచ్చినందుకు ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. పార్లమెంటు ఉభయసభల్లోనూ ఈ బిల్లుకు ఆమోద ముద్ర పడటంతో 1996లో అప్పటి ప్రధాని హెచ్‌డీ దేవేగౌడ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ మహిళా రిజర్వేషన్ల బిల్లు.. దాదాపు 3 దశాబ్దాల తర్వాత ఆమోదానికి నోచుకున్నట్లు అయ్యింది. అయితే దేశంలో నియోజకవర్గాల పునర్విభజన, జనగణన తర్వాతే ఈ మహిళా రిజర్వేషన్లు అమలు కానున్నాయని తెలుస్తోంది.
Also Read..Women Reservation Bill: మహిళా రిజర్వేషన్ బిల్లు చట్టంగా మార్చడంలో 27 ఏళ్లుగా ప్రభుత్వాలు ఎందుకు విఫలమయ్యాయి? పూర్తి చరిత్ర తెలుసుకోండి.
ఇప్పటికే మంగళవారం (సెప్టెంబర్ 19) ఈ బిల్లును లోక్‌సభలో ప్రవేశ పెట్టగా.. బుధవారం(సెప్టెంబర్ 20) దాదాపు 8 గంటల పాటు సుదీర్ఘంగా చర్చించి ఓటింగ్ నిర్వహించారు. సభలో 456 మంది సభ్యులు ఉండగా.. 454 మంది మహిళా రిజర్వేషన్ల బిల్లుకు అనుకూలంగా ఓటు వేశారు. ఇద్దరు ఎంఐఎం ఎంపీలు మాత్రమే వ్యతిరేకిస్తూ ఓటు వేశారు.