కాంగ్రెస్ తో ఆప్ పొత్తు…బీజేపీ ఓటమే లక్ష్యమన్న కేజ్రీవాల్

హర్యానాలో కాంగ్రెస్ తో పొత్తుకు ఆప్ రెడీ అయింది. ఢిల్లీలో కాంగ్రెస్ తో పొత్తు లేదని తేల్చి చెప్పిన ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ హర్యానాలో మాత్రం కాంగ్రెస్ తో పొత్తుకి రెడీ అయ్యారు. బుధవారం(మార్చి-13,2019) ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ… హర్యానాలో కలసి పోటీ చేద్దాం అంటూ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి పిలుపునిచ్చారు. లోక్ సభ ఎన్నికల్లో హర్యానాలో బీజేపీని ఓడించేందుకు కూటమి ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ కి విజ్ఞప్తి చేస్తున్నానని తెలిపారు.
Read Also : గెలుపోటముల్లో 5శాతం ఇంపాక్ట్ : అభ్యర్థుల రాతను డిసైడ్ చేస్తున్న సోషల్ మీడియా
ఆమ్ ఆద్మీ పార్టీ,జననాయక్ జనతా పార్టీ, కాంగ్రెస్ కూటమిగా కలిసి పోటీ చేసి హర్యానాలో బీజేపీని ఓడించాలని రాహుల్ ముందు తాను ప్రపోజల్ పెడుతున్నట్లు తెలిపారు. ఈ మూడు పార్టీలు కూటమిగా హర్యానాలో పోటీచేస్తే మొత్తం 10 లోక్ సభ స్థానాల్లో బీజేపీ ఓడిపోతుందని,కూటమి క్లీన్ స్వీప్ చేస్తుందని అన్నారు.
మోడీ-షా జోడీని జాతీయస్థాయిలో ఓడించేందుకు ఇది పెద్ద పాత్ర పోషిస్తుందని తెలిపారు. దేశానికి మోడీ-షా జోడీ ప్రమాదకరమన్నారు. ఢిల్లీలో కాంగ్రెస్ అవసరం లేకుండానే ఆప్ విజయం సాధిస్తుందని తెలిపారు.