Financial Discipline: ఏడాదికి 2కోట్ల జీతం, 10కోట్ల ఆస్తులు.. కానీ తండ్రిని కాపాడుకోలేకపోయాడు, అప్పుల పాలైపోయాడు.. ఆర్ధిక క్రమశిక్షణ గురించి టెకీ పాఠాలు..
అతను సింగపూర్‌లో పని చేయాలని ప్రణాళికలు వేసుకున్నప్పటికీ తన తల్లికి తోడుగా ఉండాల్సి రావడంతో ఇండియాలోనే ఉండిపోవాల్సి వచ్చింది.

Financial Discipline: ఈ రోజుల్లో ఎంత డబ్బు సంపాదించాము అన్నది కాదు. దాన్ని ఎలా ఖర్చు చేస్తున్నాం, దేనికి ఖర్చు పెడుతున్నాం, ఎంత పొదుపు చేస్తున్నాం, ఏ విధంగా దాచుకుంటున్నాము అనేది కూడా చాలా ముఖ్యం. ఎంత డబ్బు వచ్చినా.. దాన్ని కరెక్ట్ గా వాడుకోవాలి. సేవింగ్స్ చేసుకోవాలి, రైట్ ప్లేస్ లో ఇన్వెస్ట్ చేయాలి. చాలా డబ్బు ఉంది కదా అని జల్సాలకు పోయినా, అవనసరంగా ఖర్చు చేసినా, దుబారా చేసినా భారీ మూల్యం చెల్లించుకోకతప్పదు. ఆర్ధిక క్రమశిక్షణ లేకపోతే జీవితమే తలకిందులు ఖావడం ఖాయం.
బెంగళూరుకు చెందిన ఓ టెకీకి ఇదే అనుభవం ఎదురైంది. అతనికి ఏడాదికి 2.5 కోట్ల జీతం. 10 కోట్ల విలువైన ఆస్తులూ ఉన్నాయి. ఇంకేముంది లైఫ్ మొత్తం బిందాస్ అనుకున్నాడు. కట్ చేస్తే.. కన్న తండ్రిని కూడా కాపాడుకోలేకపోయాడు. అప్పుల పాలైపోయాడు. ఆరోగ్యం కూడా దెబ్బతింది. ఆ తర్వాత అతను ఏం చేశాడు, ఎలా రికవర్ అయ్యాడు అనేది అతడి మాటల్లోనే తెలుసుకుందాము..
బెంగళూరుకు చెందిన ఒక టెక్ ప్రొఫెషనల్ ఇటీవల రెడ్డిట్‌లో తన ఆర్థిక ప్రయాణాన్ని పంచుకున్నాడు. కెరీర్‌ను ప్రారంభించే వారికి ప్రయోజనం జరిగేలా పాఠాలను బోధించాడు. రెండు దశాబ్దాల క్రితం రూ. 5 లక్షల వార్షిక జీతంతో తన వృత్తి జీవితాన్ని ప్రారంభించాడు. ఆ తర్వాత ఏటా రూ. 2.5 కోట్లకు పైగా జీతం అందుకుంటున్నాడు. కానీ ఆర్థిక కష్టాలు తప్పలేదు. ఈ ప్రయాణంలో అతడు తన తండ్రిని కోల్పోయాడు, కుటుంబ వివాదాలతో పోరాడాడు, అప్పుల బాధతో సతమతమయ్యాడు, తీవ్రమైన ఆరోగ్య సమస్యలను ఎదుర్కొన్నాడు.
ఆ టెకీ దక్షిణ భారత దేశంలోని టైర్-1 నగరంలో పెరిగాడు. తండ్రి ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేశాడు. కాలేజీ చదువు తర్వాత అతను ఒక అగ్రశ్రేణి ఉత్పత్తి కంపెనీలో చేరాడు. జాబ్ లో కొత్తగా జాయిన్ అయిన వాళ్లు చేసినట్లే ఇతను కూడా తన శాలరీని ఖర్చు చేసి ఎంజాయ్ చేశాడు. తన స్నేహితుడి లానే తనకూ ఓ కారు ఉండాలని లోన్ తీసుకుని మరీ కొన్నాడు.
అదే సమయంలో అతడి తండ్రి గుండె శస్త్రచికిత్స విఫలమై ఆసుపత్రిలో చేరాడు. అప్పుడు కానీ అతడికి వాస్తవం బోధపడలేదు. ఆర్థిక పరిస్థితి తలకిందులైంది. తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. కార్పొరేట్ మెడికల్ కవరేజ్ ఉన్నప్పటికీ ఆ డబ్బు సరిపోలేదు. అది చాలక సోదరి దగ్గర రూ. 5 లక్షలు అప్పుగా తీసుకోవాల్సి వచ్చింది. చివరికి డబ్బు మొత్తం ఖర్చు అయిపోయింది.
టర్మ్ ఇన్సూరెన్స్ లేకపోవడంతో అప్పులు తీర్చడానికి, తన సోదరి వివాహ ఖర్చులను భరించడానికి అతడు.. పూర్వీకుల ఇంటిని నష్టానికి అమ్మాల్సి వచ్చింది. ఆస్తి విషయంలో బంధువులతో చట్టపరమైన వివాదం మరింత ఒత్తిడిని పెంచింది. ఈ అనుభవాలు కార్పొరేట్ ఇన్సూరెన్స్ తరచుగా సరిపోదని.. పర్సనల్, మెడికల్, టర్మ్ ఇన్సూరెన్స్ చాలా కీలకం అని అతనికి అర్థమయ్యేలా చేశాయి.
కెరీర్ గ్రోత్ Vs ఆర్థిక జ్ఞానం
అతను సింగపూర్‌లో పని చేయాలని ప్రణాళికలు వేసుకున్నప్పటికీ తన తల్లికి తోడుగా ఉండాల్సి రావడంతో ఇండియాలోనే ఉండిపోవాల్సి వచ్చింది. కొన్ని సంవత్సరాలు కష్టపడి పని చేశాడు. డైరెక్టర్‌గా ఎదిగాడు. తర్వాత ఇండస్ట్రీలో అత్యధిక జీతం వచ్చే ఉద్యోగాల్లో కొన్నింటిని సాధించాడు. సంవత్సరానికి 40 నుంచి 50 లక్షల మధ్య సంపాదించాడు. రుణాలు లేకుండా రెండవ ఇంటిని కొనుగోలు చేశాడు.
ఆర్థికంగా పురోగతి సాధించినప్పటికీ 30 ఏళ్ల వయసులోనే అతని ఆరోగ్యం దెబ్బతింది. పని ఒత్తిడి, వ్యాయామం లేకపోవడం, అనారోగ్యకరమైన ఆహారం, అధిక రక్తపోటు ఆసుపత్రిలో చేరడానికి దారితీశాయి. ఈ సంఘటన అతడి ప్రాధాన్యతలను పునరాలోచన చేసుకునేలా చేసింది. ఒక సంవత్సరం పాటు జీవనశైలిలో మార్పులు చేసుకున్నాడు. ఆ తర్వాత అతను కోలుకున్నాడు. ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చాడు.
Also Read: ఈ పోస్టాఫీసు పథకంలో ఒకసారి రూ.10వేలు ఇన్వెస్ట్ చేస్తే చాలు.. రూ. 7లక్షలకు పైగా సంపాదించుకోవచ్చు..!
తెలివైన పెట్టుబడి, దీర్ఘకాలిక ప్రణాళిక..
ఆదాయం కోట్లలో ఉన్నా అది సంపదకు దారితీయదని అతను గ్రహించాడు. ఆ తర్వాత డబ్బుని పొదుపు చేయడం, ఇన్వెస్ట్ చేయడం ప్రారంభించాడు. ఒక మార్కెట్ నిపుణుడిని సంప్రదించాడు. అది అతడి జీవితాన్ని మార్చేసింది. డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టాడు. అది మంచి లాభాన్ని తెచ్చిపెట్టింది. రాబడి రావడం ప్రారంభించింది.
నేడు, అతనికి ఎటువంటి అప్పులు లేవు. రూ.4.5 కోట్ల విలువైన రియల్ ఎస్టేట్ కలిగి ఉన్నాడు. రూ.10 కోట్ల విలువైన లిక్విడ్ ఆస్తులు కలిగి ఉన్నాడు. వార్షిక సీటీసీ రూ.2.5 కోట్లు. ఇంత డబ్బు ఉన్నా అతను నిరాడంబరంగా జీవిస్తున్నాడు. ఖర్చులను తగ్గించుకున్నాడు. దుబారా చేయడం లేదు. ఇప్పటికీ మారుతి కారు నడుపుతాడు. ఆర్థిక క్రమశిక్షణ అలవాటు చేసుకున్నాడు.
తన ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటూ.. ఆదాయం మాత్రమే సంపదకు సమానం కాదని అతడు నొక్కి చెప్పాడు. పొదుపు, తెలివైన పెట్టుబడి, తగినంత బీమా, జాగ్రత్తగా చేసే ఖర్చులు, ఆర్థిక క్రమశిక్షణ ప్రతి మనిషికి అవసరం అంటున్నారు. ”వినయంగా ఉండండి, ముందుగానే ప్రణాళిక వేసుకోండి, ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వండి, కృతజ్ఞతతో ఉండండి. ఎందుకంటే ఎంత సురక్షితంగా అనిపించినా, జీవితం ఒక్క క్షణంలో మారిపోవచ్చు” అని విలువైన సలహా ఇచ్చాడు ఆ టెకీ.
తెలివిగా పొదుపు చేయడం, అనవసరమైన ఖర్చులను నివారించడం, ఉత్పాదకతను పెంచడానికి AI సాధనాలను ఎలా ఉపయోగించాలో నేర్చుకోవడం.. ప్రతి మనిషి మనుగడకు కీలకం. డబ్బు సంపాదించడం మాత్రమే తెలిస్తే సరిపోదు… తెలివిగా పెట్టుబడి పెట్టడం, పొదుపైన జీవనశైలి కలిగి ఉండటం కూడా అంతే అవసరం అంటున్నారు ఆర్థిక నిపుణులు.