పాక్ నుంచి ధనాధనా దూసుకొచ్చిన మిసైళ్లు, డ్రోన్లను భారత్ ఇలా ధ్వంసం చేసింది.. దాయాది దాడులు విఫలమైన తీరు ఇది..
ఈ మూడు రకాలతో కూడిన రక్షణ వ్యవస్థను భారత్ యాక్టివేట్ చేసి ఉంచడంతో పాక్ యుద్ధ విమానాలు, డ్రోన్లు గగనతలంలోనే ధనాధనా పేలిపోయాయి.

భారత్‌పై పాకిస్థాన్ అంత భారీ స్థాయిలో మిసైళ్లు, డ్రోన్లతో విరుచుకుపడ్డప్పటికీ ఇండియా ఆ దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టింది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత పీవోకే, పాకిస్థాన్ భూభాగంలో మే 7న భారత్ ఆపరేషన్ సిందూర్ నిర్వహించి ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేయడంతో పాక్ జీర్ణించుకోలేకపోతోంది. దీంతో పాక్ దాడులకు పాల్పడవచ్చని ముందుగానే అంచనా వేసిన భారత్.. దాయాదికి బుద్ధి చెప్పడానికి అన్ని విధాలుగా సిద్ధంగా ఉంది.
జమ్మూతో పాటు రాజస్థాన్, పంజాబ్‌లోకి పాక్ నుంచి దూసుకొచ్చిన మిసైళ్లు, డ్రోన్లను గగనతలంలోనే పేల్చి వేసింది. పాకిస్థాన్ ఫైటర్ జెట్లను భారత్ చిత్తు చిత్తు చేసింది. పాక్ రక్షణ వ్యవస్థలను సైతం ధ్వంసం చేసింది. భారత్‌లో ఎటువంటి నష్టమూ జరగకుండా మన రక్షణ వ్యవస్థ అత్యంత సమర్థవంతంగా పనిచేసింది.
పాకిస్థాన్ నుంచి దూసుకువచ్చిన యుద్ధ విమానాలు, డ్రోన్లు ఇప్పుడు శకలాలుగా చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. భారత సైనిక శక్తి ఏంటో, మన రక్షణ వ్యవస్థ ఎంత పటిష్ఠంగా ఉందో పాకిస్థాన్‌కు తెలిసొచ్చింది. భారత్‌పై దాడులు చేయడం అంత సులభం కాదని పాక్‌కు ఈ దెబ్బతో అర్థమైంది.
భారత రక్షణ వ్యవస్థ ఎలా పనిచేసింది?
పాక్ దాడులను తిప్పికొట్టడంపై భారత రక్షణ మంత్రిత్వ శాఖ స్పందిస్తూ.. పాకిస్థానీ డ్రోన్లు, క్షిపణులను వెంటనే గుర్తించి నాశనం చేశామని తెలిపింది. ఇందుకోసం భారత రక్షణ వ్యవస్థలను ఉపయోగించామని చెప్పింది. ఇంటిగ్రేటెడ్ కౌంటర్ యూఏఎస్ గ్రిడ్ (శత్రు డ్రోన్లను అడ్డుకునే ఓ వ్యవస్థ), వైమానిక రక్షణ వ్యవస్థల ద్వారా పాక్ క్షిపణులు, యుద్ధ విమానాలను కూల్చేశామని ప్రకటించింది.
పాక్ నుంచి దాడులు జరగొచ్చని ముందుగానే అంచనా వేసిన భారత్.. సరిహద్దుల్లో గగనతలంలో 1,800 కిలోమీటర్ల మేర రక్షణ వ్యవస్థను వెంటనే యాక్టివేట్ చేసింది. ఈ రక్షణ వ్యవస్థలో సెన్సార్లు, ఎయిర్ డిఫెన్స్ మిసైళ్లు, జామర్లు ఉంటాయి.
వీటిలోని సెన్సార్లు దాడులను పసిగడతాయి. మిసైళ్లు శత్రుదేశ యుద్ధ విమానాలను ధ్వంసం చేస్తాయి. జామర్లు సిగ్నళ్లను బ్లాక్ చేస్తాయి. ఈ మూడు రకాలతో కూడిన రక్షణ వ్యవస్థను భారత్ యాక్టివేట్ చేసి ఉంచడంతో పాక్ యుద్ధ విమానాలు, డ్రోన్లు గగనతలంలోనే ధనాధనా పేలిపోయాయి.
C-UASతో పాక్ డ్రోన్లు తుక్కు తుక్కు
పాకిస్థాన్ దాడులను అడ్డుకోవడానికి భారత్ C-UASను వాడింది. C-UAS అంటే కౌంటర్-అన్‌మ్యాన్డ్ ఎయిర్‌క్రాఫ్ట్ సిస్టమ్. ఇది శత్రు డ్రోన్‌లను ఆపే రక్షణ వ్యవస్థ. శత్రు డ్రోన్‌లను గుర్తించడం, ట్రాక్ చేయడం, పేల్చేయడం అనే మూడు విధాలుగా ఈ వ్యవస్థ పనిచేస్తుంది.
C-UASలో పలు రకాల టెక్నాలజీ ఉంటుంది. గగనతలంలోని డ్రోన్లను గుర్తించడానికి C-UASలో రాడార్లు, డ్రోన్ల సిగ్నళ్లను కనిపెట్టడానికి రేడియో ఫ్రీక్వెన్సీ సెన్సార్, విజువల్ ట్రాకింగ్ కోసం ఆప్టికల్ కెమెరాలు, డ్రోన్ మోటార్ల సౌండ్లను వినడానికి అకౌస్టిక్ డిటెక్టర్లు ఉంటాయి.
గగనతలంలో డ్రోన్లు కనపడగానే ఏం జరిగింది?
శత్రుదేశ డ్రోన్‌లను ఆపడానికి C-UAS అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తుంది. జామింగ్ సిగ్నల్స్ ద్వారా శత్రు దేశ డ్రోన్, దాని కంట్రోలర్ మధ్య కమ్యూనికేషన్‌ను అడ్డుకుంటుంది. జీపీఎస్ స్పూఫింగ్ ద్వారా డ్రోన్ లొకేషన్‌ను కన్ఫ్యూజ్ చేస్తుంది. కైనెటిక్ ఇంటర్‌సెప్టర్లు ద్వారా డ్రోన్‌ను పేల్చి వేస్తుంది. ఈ పనులన్నింటినీ చేసి పాక్ డ్రోన్లను C-UAS ధ్వంసం చేసింది. భారత్ ఇప్పటికే దేశవ్యాప్తంగా ఈ యాంటీ డ్రోన్ వ్యవస్థల నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసుకుంది.దీనిని ఇంటిగ్రేటెడ్ C-UAS గ్రిడ్ అని పిలుస్తారు.
గగనతల రక్షణ వ్యవస్థ పనిచేసిన తీరు ఇది
పాకిస్థాన్ యుద్ధ విమానాలను గుర్తించి, పేల్చేయడానికి భారత్ S-400 ట్రయంఫ్ సిస్టమ్ (లాంగ్ రేంజ్ డిఫెన్స్)ను వాడింది. ఇది రష్యా నుంచి దిగుమతి చేసుకున్న శక్తిమంతమైన క్షిపణి రక్షణ వ్యవస్థ. భారత్ మొత్తం 5 స్క్వాడ్రన్లను (యూనిట్లను) రష్యాకు ఆర్డర్ ఇచ్చింది.
వాటిలో ఇప్పటివరకు మూడు స్క్వాడ్రన్లు మనకు అందాయి. మరి కొన్ని నెలల్లో మిగతా రెండు స్క్వాడ్రన్లు వస్తాయి. 450 కిలోమీటర్ల దూరం వరకు పొంచి ఉన్న ముప్పును S-400 పసిగట్టి అడ్డుకుంది. పాకిస్థాన్ యుద్ధ విమానాలు వాటి లక్ష్యాలకు దగ్గరకు రాకముందే S-400 పసిగట్టి అడ్డుకుంది. పాకిస్థాన్ సరిహద్దుల వద్ద ఎస్-400 వ్యవస్థలను భారత్ మోహరించింది.
మీడియం-రేంజ్ డిఫెన్స్ (70–150 కి.మీ)
భారత్ వద్ద MR-SAM (మీడియం రేంజ్ సర్‌ఫేస్ టు ఎయిర్ మిసైల్), బరాక్ 8 వ్యవస్థలు కూడా ఉన్నాయి. వీటిని డీఆర్‌డీవో, ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ అభివృద్ధి చేశాయి. యుద్ధ విమానాలు, క్షిపణులు వంటివాటిని మీడియం-రేంజ్ డిఫెన్స్ కూకాల్చివేస్తుంది. భూతలం, నౌకల నుంచి వీటిని ప్రయోగిస్తారు.
ఆకాశ్ సిస్టమ్
ఇది స్వదేశీ రక్షణ వ్యవస్థ. 30 నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను ఛేదిస్తుంది. శత్రు విమానాలు, క్షిపణులు వంటి వాటిని ధ్వంసం చేస్తుంది.
స్పైడర్ సిస్టమ్
ఇజ్రాయెల్‌కు చెందిన స్పైడర్ సిస్టమ్ మన వద్ద ఉంది. 8 నుంచి 10 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదిస్తుంది. సైనిక స్థావరాలు, విమానాశ్రయాలు వంటివాటిపై జరిగే దాడులను తిప్పికట్టడానికి భారత్ వీటిని వాడుతుంది.
లెగసీ సిస్టమ్స్
ఇండియా ఇప్పటికీ లెగసీ సిస్టమ్స్‌ను వాడుతుంది. ఇవి పాత వ్యవస్థలు. పెచోరా, ఓఎస్‌ఏ-ఏకే వంటి వ్యవస్థలు అప్పటి సోవియట్ యూనియన్‌కు చెందినవి. ఈ వ్యవస్థలను భారత్ ఇప్పటికీ కొన్ని ప్రదేశాలలో ఉపయోగిస్తోంది. ఈ లెగసీ సిస్టమ్స్ ను దశలవారీగా భారత్ వాడుకలో నుంచి తొలగిస్తోంది.
VSHORAD (వెరీ షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్)
తక్కువ ఎత్తులో ఎగిరే డ్రోన్లు లేదా హెలికాప్టర్ల వంటి వాటిని వీటి ద్వారా కూల్చవచ్చు. ఇవి భుజం నుంచి ప్రయోగించే క్షిపణులు. సైనికులు మోసుకెళ్లి ప్రయోగిస్తారు. శిల్కా, తుంగుస్కా వంటి గన్ వ్యవస్థలు ఇవి.
ఈ పై వ్యవస్థలు అన్నింటినీ భారత్ సమర్థంగా వాడుకుంటోంది. మన దేశాన్ని రక్షించడంలో వీటివే కీలక పాత్ర. పాకిస్థాన్ దాడులకు తెగబడితే వీటి ద్వారానే భారత్ ఎదుర్కొంటోంది.