IAS Krishnaiah: సుప్రీంకోర్టుకు ఐఏఎస్ జి.కృష్ణయ్య భార్య.. ఆయన ఫ్యామిలీపై ఈగ వాలినా ఊరుకునేది లేదన్న బీజేపీ నేత
IAS Krishnaiah: సుప్రీంకోర్టులో ఐఏఎస్ జి.కృష్ణయ్య భార్య ఎందుకు పిటిషన్ వేశారు? వారి కుటుంబ భద్రతపై బీజేపీ నేత ఎందుకు ఆందోళన వ్యక్తం చేశారు?

IAS Krishnaiah
IAS Krishnaiah: ఐఏఎస్ జి.కృష్ణయ్య (G Krishnaiah) భార్య ఉమా కృష్ణయ్య సుప్రీంకోర్టు (Supreme Court)ను ఆశ్రయించారు. కృష్ణయ్యను చంపిన ఆనంద్ మోహన్ సింగ్ (Anand Mohan Singh)ను బిహార్ ప్రభుత్వం జైలు నుంచి విడుదల చేయడాన్ని ఆమె కోర్టులో సవాలు చేశారు.
ఆనంద్ మోహన్ సింగ్ కు జీవితకాల జైలు శిక్ష పడిందని, ఆయన చనిపోయే వరకు జైలులో ఉంచకుండా 14 ఏళ్లకే విడుదల చేయడం సరికాదని ఆమె అన్నారు. ఆనంద్ మోహన్ సింగ్ కు ఎలాంటి వెసులుబాటూ ఇవ్వకుండా, కోర్టు ఆదేశాలను కచ్చితమైన రీతిలో పాటిస్తూ ఆయనను చనిపోయే వరకు జైలులో ఉంచాలని పిటిషన్ లో పేర్కొన్నారు.
కృష్ణయ్య ఫ్యామిలీకి రక్షణ కల్పించాలి..
తెలంగాణ బిడ్డ ఐఏఎస్ కృష్ణయ్యను చంపిన వ్యక్తిని జైలు నుంచి విడుదల చేస్తే సీఎం కేసీఆర్ ఎందుకు మాట్లాడం లేదని మాజీ డీజీపీ, బీజేపీ నేత కృష్ణ ప్రసాద్ నిలదీశారు. సీఎం కేసీఆర్ బిహార్ వెళ్లి, అక్కడ నితీశ్ కుమార్ తో వేదికను పంచుకుంటారని, కానీ ఈ అంశంపై మాత్రం ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. ఐఏఎస్, ఐపీఎస్ ల మీద ఏమాత్రం ప్రేమ ఉన్నా ఈ అంశంపై స్పందించాలని అన్నారు.
“నితీశ్ కుమార్ కు సీఎం కేసీఆర్ అధికారికంగా లేఖ రాసి మీరు చెప్పింది తప్పు అని ఖండించాలి. ప్రేమ లేకపోతే అవసరం లేదు. ఐఏఎస్ కృష్ణయ్యను చంపిన వ్యక్తి ఆనంద్ మోహన్ హైదరాబాద్ కు వస్తున్నారని తెలిసింది. ఈ నేపథ్యంలో ఐఏఎస్ కృష్ణయ్య ఫ్యామిలీకి రక్షణ కల్పించాలి.
ఆయన ఫ్యామిలీపై ఈగ వాలినా ఊరుకునేది లేదు. ఒక వ్యక్తి విడుదల చేసేందుకు నితీశ్ ప్రభుత్వం ఒక క్లాజును తొలగించింది. కృష్ణయ్య బిహార్ క్యాడర్ అయినప్పటికీ స్పెషల్ కేసుగా తీసుకుని వారి కుంటుబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి” అని కృష్ణ ప్రసాద్ డిమాండ్ చేశారు.
జి.కృష్ణయ్యది మహబూబ్ నగర్ జిల్లా
జి.కృష్ణయ్య హత్య 1995లో జరిగింది. పెద్ద గ్యాంగ్‌స్టర్ అయిన ఆనంద్ మోహన్ రాష్ట్రీయ జనతా దళ్ పార్టీలో చేరి ఎంపీగా గెలుపొందారు. 1995లో ఐఏఎస్ అధికారి, గోపాల్‌గంజ్ జిల్లా మేజిస్ట్రేట్ జి.కృష్ణయ్యను కారులో ప్రయాణిస్తుండగా కొందరు దుండగులు ఆయన కారును ఢీ కొట్టి, ఆయనను కారు నుంచి బయటకు లాగి చంపారు.
ఆ దుండగుల గుంపు ఆనంద్ మోహన్‌కు సంబంధించినదిగా తేలింది. జి.కృష్ణయ్య తెలంగాణలోని ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన వారు. నిరుపేద కుటుంబంలో పుట్టి ఐఏఎస్ స్థాయికి ఎదిగారు.
Bihar: నితీశ్ హయాంలోనే జైలుకు వెళ్లిన అతడు, నితీశ్ హయాంలోనే ఎందుకు విడుదలయ్యాడు?
Anand Mohan: గ్యాంగ్‌స్టర్-పొలిటీషియన్ ఆనంద్ మోహన్ విడుదల.. బిహార్ ప్రభుత్వంపై విమర్శల వెల్లువ