భారత గబ్బిల్లాల్లో కరోనా వైరస్…ICMR పరిశోధనల్లో వెలుగులోకి కీలక విషయాలు

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారిపై పలు దేశాలు ముమ్మర పరిశోధనలు చేస్తున్నాయి. ఈ క్రమంలో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ICMR) చేసిన పరిశోధనలో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. భారత్‌లో నివసించే గబ్బిలాల్లో కరోనా వైరస్ ఉన్నట్లు గుర్తించారు. ICMRపరిశోధనలు ఇప్పుడు ఆందోళన కలిగిస్తున్నాయి.
భారత్‌లో వైద్య పరిశోధనలకు సంబంధించిన జర్నల్‌లో (Indian Journal of Medical Research) దీనిపై ఓ కథనం ప్రచురించారు. పుణేలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (NIV)తో కలిసి ఐసీఎంఆర్ నిర్వహించిన పరిశోధనలో ఆసక్తికర వివరాలు వెల్లడైనట్లు కథనంలో తెలిపారు. భారత్‌లో నివసించే రౌసెటస్, టెరోపస్ అనే రెండు రకాల గబ్బిలాల్లో కరోనా వైరస్‌ను గుర్తించినట్లు ఐసీఎంఆర్ తెలిపారు. టెరోపస్ గబ్బిలాలను ఇండియన్ ఫ్లయింగ్ ఫాక్స్ అని కూడా వ్యవహరిస్తారు. 2018, 2019లో ఈ గబ్బిలాలతోనే కేరళలో నిఫా వైరస్ వ్యాపించింది. నిఫా కారణంగా కేరళలో 17 మంది మరణించిన విషయం తెలిసిందే. వీటిలో కరోనా వైరస్‌ను గుర్తించడం ఇదే మొదటిసారి.
తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, గుజరాత్, ఒడిశా, చండీగఢ్, పుదుచ్చేరిల్లోని అడవుల్లో నివసించే పలు రకాల గబ్బిలాలపై ఈ పరిశోధన నిర్వహించినట్లు నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ శాస్త్రవేత్త డాక్టర్ ప్రగ్యా యాదవ్ తెలిపారు. మొత్తం 25 గబ్బిలాలకు సంబంధించిన నమూనాలను సేకరించి పరిశోధన నిర్వహించినట్లు ఆమె తెలిపారు. కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, హిమాచల్ ప్రదేశ్ ప్రాంతాల్లో కనిపించే రెండు జాతులకు చెంది గబ్బిలాల్లోనే కరోనా వైరస్ జాడ కనిపించినట్లు తెలిపారు.
తెలంగాణ,కర్ణాటక,గుజరాత్,ఒడిషా,చండీగఢ్ తో పాటు మిగతా రాష్ట్రాల నుంచి సేకరించిన గబ్బిలాల నమూనాల్లో ఈ వైరస్ కనిపించలేదు. అయితే,ఈ గబ్బిలాల్లో గుర్తించిన వైరస్‌తో ప్రస్తుతం కరోనా మహమ్మారికి కారణమైన ‘SARS-CoV2’ వైరస్ కు ఎలాంటి సంబంధం లేదని పరిశోధకులు స్పష్టం చేశారు. ఈ రకం కరోనా వైరస్ వల్ల మానవుల్లో ఇన్‌ఫెక్షన్లు కలుగుతాయని చెప్పడానికి కూడా ఎలాంటి ఆధారాలు లేవని ప్రగ్యా యాదవ్ తెలిపారు.
వాస్తవానికి ఇప్పటివరకు 6 రకాల కరోనా వైరస్‌లను గుర్తించారు. తొలిసారిగా ఈ వైరస్‌ను 1960లోనే గుర్తించారు. ప్రస్తుతం ప్రపంచాన్ని కలవరపెడుతున్న కోవిడ్-19కు కారణమైన కరోనా వైరస్ కొత్తది. నిఫా వైరస్‌కు సంబంధించి కొనసాగిస్తున్న పరిశోధనల్లో గబ్బిలాల్లో కరోనా వైరస్ ఉన్న విషయాన్ని గుర్తించారు. దీన్ని 2019లోనే గుర్తించడం గమనార్హం. 2018 నుంచే గబ్బిలాలపై పలు రకాల పరిశోధనలు సాగుతున్నాయని ప్రగ్యా యాదవ్ తెలిపారు. కరోనా వైరస్ నిర్ధారణకు ఉపయోగించే ‘రివర్స్ ట్రాన్స్‌క్రిప్షన్ చైన్ రియాక్షన్’ (ఆర్‌టీ-పీసీఆర్) పరీక్షలు నిర్వహించినప్పుడు ‘పాజిటివ్’ ఫలితాలు వచ్చాయని ఆమె తెలిపారు.
గబ్బిలాల శరీరం చాలా రకాల వైరస్‌లకు ఆవాసంగా ఉంది. పరిశోధకులు ఈ గబ్బిలాలను ‘వైరస్ రిజర్వాయర్లు’గా పేర్కొంటారు. అయితే.. ఈ వైరస్‌ల వల్ల గబ్బిలాలకు ఎలాంటి ప్రమాదం లేదు. ఈ క్షీరదాల్లోని రోగ నిరోధక వ్యవస్థ భిన్న రకాల వైరస్‌లను తిప్పికొట్టగలదని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. గబ్బిలాల్లో ఉండే ఈ ప్రాణాంతక వైరస్‌లు ఇతర జంతువులు, మనుషులకు సోకుతాయని చెప్పడానికి కూడా ఎలాంటి ఆధారాలు లేవు. గబ్బిలాల నుంచి వైరస్ మనుషులకు సోకడం చాలా అరుదైన విషయమని ఐసీఎంఆర్ అంటువ్యాధుల విభాగాధిపతి రామన్ గంగా ఖేడ్ కర్ తెలిపారు. గబ్బిలాల నుంచి మనుషులకు వైరస్ సోకుతుందనేది వెయ్యేళ్లకొకసారి జరుగుతుందని ఆయన తెలిపారు.