మే నెల నాటికే దేశంలో 64లక్షల మందికి కరోనా

భారత్‌లో కరోనా మహమ్మారి విశ్వరూపం చూపిస్తోంది. గత 24 గంటల్లో రికార్డు స్థాయిలో 96, 551 కేసులు బయటపడ్డాయి. ఇప్పటి వరకూ ఒకే రోజులో అత్యధిక కేసుల సంఖ్య ఇదే కావడం గమనార్హం. దీంతో మొత్తం కేసుల సంఖ్య 45,62,415 కు చేరుకుంది. మొత్తం మరణాల సంఖ్య 76,271 కు చేరుకుందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 35,42,664 గా ఉంది.
అయితే, మే నెల వరకే దేశంలో 64 లక్షల మందికి కరోనా సోకి ఉంటుందని ఐసీఎంఆర్ అంచనా వేసింది. దేవ్యాప్తంగా నిర్వహించిన సీరో సర్వే ఫలితాలను ఐసీఎంఆర్ రిలీజ్ చేసింది. మే నెల ఆరంభంలో దేశవ్యాప్తంగా సుమారు 64,68,388 మంది పెద్దలకు వైరస్ ఇన్‌ఫెక్షన్ సోకి ఉంటుందని సీరో సర్వే నివేదిక వెల్లడించింది. ఇండియన్ జర్నల్ ఆఫ్ మెడికల్ రీసర్చ్‌లో సర్వే వివరాలను ప్రచురించారు.
మే 11 నుంచి జూన్ 4వ తేదీ వరకు సీరో సర్వేను నిర్వహించారు. దీని కోసం 21 రాష్ట్రాల్లోని సుమారు 28వేల మంది రక్త నమోనాలను పరీక్షించారు. 18 నుంచి 45 ఏళ్ల మధ్య వయసు ఉన్నవారిలో సీరో పాజిటివిటీ ఎక్కువగా 43.3 శాతం ఉన్నట్లు అంచనా వేశారు. ఆ తర్వాత 46- 60 ఏళ్ల మధ్య వారిలో 39.5 శాతం, 60 ఏళ్లు దాటిన వారిలో 17.2 శాతం సీరో పాజిటివిటీ ఉన్నట్లు గుర్తించారు.సీరో పాజిటివిటీ పరీక్ష ద్వారా రక్తంలో యాంటీబాడీలు ఉన్నాయో లేదో తెలుస్తుంది.
https://10tv.in/india-coronavirus-updates-40-lakh-mark-with-more-than-86000-new-infections/
మే, జూన్ నెలల్లో గ్రామీణ ప్రాంతాలకు వైరస్ ప్రబలినట్లు గుర్తించారు. తొలుత పెద్ద నగరాల్లో కేసులు నమోదు అయినా.. ఇప్పుడు చిన్న చిన్న పట్టణాలు, గ్రామాలకు కరోనా విస్తరించడంతో ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో సీరో పాజిటివిటీ 69.4 శాతంగా, పట్టణ మురికివాడల్లో 15.9 శాతంగా, పట్టణ ప్రాంతాల్లో 14.6 శాతంగా ఉన్నట్లు గుర్తించారు.
మే నెలలో సగటున 82 నుంచి 130 మందికి సోకిన ఇన్‌ఫెక్షన్లను గుర్తించలేకపోయినట్లు ఐసీఎంఆర్ చెప్పింది. మే నెల వరకు జనాభాలో కేవలం ఒక శాతం మంది మధ్యవయస్కులకు మాత్రమే సార్స్ సీఓవీ2 వైరస్ సంక్రమించి ఉంటుందని భావిస్తున్నారు.