‘Idli ATM’ : చట్నీ, కారప్పొడితో పాటు నిమిషంలోపే వేడి వేడి ఇడ్లీలు రెడీ ..
‘Idli ATM’.. చట్నీ, కారప్పొడితో పాటు నిమిషంలోపే వేడి వేడి ఇడ్లీలు రెడీ .. 24 గంటలు అందుబాటులో ‘Idli ATM’..

‘Idli ATM’
‘Idli ATM’ : ATM అంటే ఎనీ టైమ్ మనీ ఇచ్చే మిషన్ అనుకుంటాం. కానీ ATM అంటే Automated teller machine. ATM అంటే ఎనీ టైమ్ మర్డర్ అని ఓ సినిమాలో డైలాగ్ కూడా ఉంది. ఇలా ATM గురించి అర్ధాలు..సెటైర్లు పక్కన పెడితే. ATMలో డ్రా చేసుకునే డబ్బుల వస్తాయి. కానీ ఇడ్లీ ఏటీఎం (Idli ATM)గురించి మీకు తెలుసా? 24 గంటలూ ఎప్పుడ కావాలంటే అప్పడు వేడి వేడిగా ఇడ్లీలు అందిస్తుందీ ఇడ్లీ ATM. పైగా చక్కటి రుచికరమైన చట్నీతో పాటు కారం కారంగా కారంపొడికూడా అందిస్తుందీ Idli ATM.
కర్ణాటక రాజధానిలో ఒక స్టార్టప్ కంపెనీ ‘ఇడ్లీ ఏటీఎం’లను ఏర్పాటు చేసింది. బెంగళూరుకు చెందిన శరణ్ హిరేమత్, సురేష్ చంద్రశేఖరన్‌లు స్థాపించిన స్టార్టప్ ఫ్రెషప్ రోబోటిక్స్, ఇన్‌స్టెంట్ ఇడ్లీ తయారు యంత్రాన్ని రూపొందించింది. ఇరవై నాలుగు గంటలు వేడి వేడి ఇడ్లీలు అందించే ఈ ఏటీఎంను ఫ్రెషాట్‌లో ఏర్పాటు చేశారు. ఈ మిషన్ కేవలం 12 నిమిషాల్లో 72 ఇడ్లీలు తయారు చేయగలదు. చట్నీ, కారప్పొడి వంటి వాటితో ఇడ్లీలను ప్యాక్ చేసి మరీ అందిస్తుంది.
ఈ ఏటీఎం ద్వారా వేడి వేడి ఇడ్లీలు పొందడం చాలా చాలా ఈజీ. ఏటీఎం వద్ద ఉన్న క్యూఆర్ కోడ్‌ను మొబైల్ ఫోన్‌తో స్కాన్ చేయాలి. దీంతో మెనూ కనిపిస్తుంది. ఇడ్లీలు ఆర్డర్ చేసి డబ్బులను ఆన్‌లైన్‌లో చెల్లిస్తే వేడి వేడి ఇడ్లీలు లొట్టలేసుకుంటూ లాగించేయొచ్చు. కేవలం నిమిషంలోపే (సుమారు 55 సెకన్లలో) చట్నీతో ఇడ్లీ ప్యాక్ ఆ ఏటీఎం నుంచి బయటకు వస్తుంది. తీసుకుని ప్యాక్ తెరిచి ఇడ్లీలు తినడమే..అంతే..
Idli ATM in Bangalore… pic.twitter.com/NvI7GuZP6Y
— B Padmanaban (padmanaban@fortuneinvestment.in) (@padhucfp) October 13, 2022
వెరైటీగా ఉన్నఈ ఇడ్లీ ఏటీఎం ఆలోచన తనకు ఎలా వచ్చిందో అన్నది శరణ్ హిరేమత్ చెబుతూ..2016లో తన కూతురుకి అనారోగ్యంతో బాధపడిన సమయంలో అర్థరాత్రి వేళ ఎక్కడా వేడి వేడి ఇడ్లీలు లభించక ఇబ్బంది పడ్డానని..అందుకే 24 గంటలపాటూ తాజాగా ఇడ్లీలు తయారు చేసే ఏటీఎం యంత్రాన్ని రూపొందించాలన్న ఆలోచన వచ్చిందన్నారు. ఆ ఆలోచన నుంచి వచ్చిందే ఈ Idli ATM అని తెలిపారు.
టిఫిన్ కోసం దక్షిణ భారత్‌లో ఏర్పాటు చేసిన తొలి ఆటోమేటెడ్ కుకింగ్, పంపిణీ మిషన్ ఇదేనని శరణ్ హిరేమత్ తెలిపారు. ప్రస్తుతం బెంగళూరులోని రెండు చోట్ల ఇడ్లీ ఏటీఎంలను ఏర్పాటు చేసామని..మరింతగా విస్తరించాలనే ఆలోచన ఉందని తెలిపారు. ఇడ్లీలతో పాటు దోశ, రైస్, జ్యూస్ వంటి ఏటీఎంలను కూడా అందుబాటులోకి తెచ్చే ఆలోచన ఉందని వెల్లడించారు. ఈ వేడి వేడిగా ఇడ్లీలు అందించే ఏటీఎం వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.