పాంగాంగ్​ వెంబడి భారత్-చైనా బ‌ల‌గాల ఉపసంహ‌ర‌ణ పూర్తి ‌

పాంగాంగ్​ వెంబడి భారత్-చైనా బ‌ల‌గాల ఉపసంహ‌ర‌ణ పూర్తి ‌

Updated On : February 19, 2021 / 5:44 PM IST

Pangong Tso తూర్పు లడఖ్‌లో భారత్, చైనా మధ్య ఉద్రిక్తతలు నెమ్మదిగా సడలుతున్నాయి. వాస్త‌వాధీన రేఖ ద‌గ్గ‌ర పాంగాంగ్ స‌ర‌స్సుకు ఇరువైపులా ఇండియా, చైనా బ‌ల‌గాల ఉపసంహ‌ర‌ణ ప్ర‌క్రియ శుక్ర‌వారం పూర్త‌యింది. భారత దళాలు తమ స్థావరాలకు చేరుకున్నాయి. ఈ మేరకు భారత సైనిక వర్గాలు శుక్రవారం తెలిపాయి.

గ‌త వారం రెండు దేశాల మ‌ధ్య కుదిరిన ఒప్పందం మేర‌కు పాంగాంగ్ సో సరస్సు ఉత్తర, దక్షిణ తీరాల్లో బలగాల ఉపసంహరణ పూర్త‌యింది. ఇందులో భాగంగా 150 చైనా యుద్ధ ట్యాంకులు, 5 వేల మంది చైనీస్ పీపుల్స్ లిబ‌రేష‌న్ ఆర్మీ సైనికులు వెన‌క్కి వెళ్లిపోయారు.

ఇక, మిగిలిన ఘర్షణ ప్రాంతాల నుంచి దళాల ఉపసంహరణపై…శనివారం భారత్, చైనా మధ్య 10వ విడత చర్చలు జరుగుతాయి. శనివారం ఉదయం 10 గంటలకు చైనా భూభాగంలోని మాల్దో పోస్టు వద్ద ఈ సమావేశం జరగనుంది. గోగ్రా, హాట్ స్ప్రింగ్స్ ఘర్షణ ప్రాంతాల నుంచి దళాల ఉపసంహరణ గురించి ఇరు దేశాల మిలిటరీ కమాండర్లు చర్చిస్తారు.