బోర్డర్ లో టెన్షన్…భారత్-చైనాల మధ్య టాప్ మిలటరీ స్థాయి చర్చలు

తూర్పు లఢఖ్ లోని బోర్డర్ లో భారత్-చైనా దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో లఢఖ్ లో శనివారం(జూన్-6,2020)భారత్-చైనాల మధ్య ఉన్నత మిలటరీ స్థాయి చర్చలు జరుగనున్నాయి. చర్చల కోసం భారత్ మొదట ప్రయత్నించగా చైనా దానికి అంగీకరించింది. ఇండియన్ బోర్డర్ పాయింట్ చుషుల్-మోల్డో ప్రాంతం దగ్గర ఈ మీటింగ్ జరుగనుంది. 14 కార్ప్స్ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ హరీందర్ సింగ్ నేతృత్వంలో భారత్ ఈ చర్చల్లో పాల్గొంటుంది. శనివారం చర్చలకు సంబంధించి ఆర్మీ ఉన్నతవర్గాలు మాట్లాడుతూ…ఇవి సానుకూల సంకేతాలు అని తెలిపారు.
భారత్-చైనా సరిహద్దుల్లో ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులే నెలకొన్నట్లు అర్థమవుతోంది. అటు వైపు చైనా భారీగా సైన్యాన్ని సరిహద్దుల దగ్గరకి తరలిస్తుంటే..మరో వైపు భారత్ కూడా సరిహద్దుల దగ్గర భారీగానే సైన్యాన్ని మొహరించింది. 1962లో భారత్-చైనా యుద్ధం తర్వాత మళ్లీ సరిహద్దుల్లో తీవ్రమన ఉద్రిక్తపరిస్థితులు ఇప్పుడు నెలకొన్నాయనే చెప్పవచ్చు. 2017లో తూర్పు హిమాలయాల్లోని డోక్లామ్ సరిహద్దు దగ్గర కూడా దాదాపు 3నెలల పాటు భారత్-చైనాల మధ్య ఇదేరకమైన ప్రతిష్ఠంభణ నెలకొంది.
లఢఖ్,సిక్కింలలోని LAC(వాస్తవాధీన రేఖ)చుట్టుూ చైనా మిలటరీ తమ ట్రూప్స్ తో సాధారణ పాట్రోలింగ్ ను అవరోధంగా లేదా ప్రతిబంధకముగా మారుస్తుందని భారత్ తెలిపింది. మరోవైపు భారత్-చైనా బోర్డర్ లో టెన్షన్ ఇష్యూ మంగళవారం అమెరికా అధ్యక్షుడు ట్రంప్-భారత ప్రధాని మోడీ ఫోన్ సంభాషణలో ముఖ్యమైనదని భారత ప్రభుత్వం తెలిపింది. అయితే,ఇటీవల భారత్-చైనా అంగీకరిస్తే రెండుదేశాల మధ్య మధ్యవర్తిత్వం వహించి…సరిహద్దు సమస్యను పరిష్కరిస్తానంటూ ట్రంప్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. అయితే ట్రంప్ మధ్యవర్తిత్వం ఆఫర్ ను అటు చైనా,ఇటు భారత్ రెండూ తిరస్కరించాయి.
LAC వద్ద భారత సరిహద్దుల్లో చైనా దూకుడు పట్ల తాము తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు సోమవారం అమెరికా ప్రకటించింది. నిబంధనలను చైనా పాటించాలని,భారత్ తో బోర్డర్ సమస్యను పరిష్కరించుకునేందుకు దౌత్యపరమైన చర్చలు,ఉన్న మెకానిజమ్స్ ను ఉపయోగించుకోవాలని తాను చైనాను కోరుతున్నట్లు యూఎస్ హౌస్ ఆఫ్ రిప్రజంటేటివ్స్ ఫారిన్ ఎఫఐర్స్ కమిటీ చీఫ్ ఇల్లియట్ తెలిపారు.