దేశ జనాభా @130కోట్లు: తెలంగాణలో ఆ మూడే టాప్

దేశ జనాభా @130కోట్లు: తెలంగాణలో ఆ మూడే టాప్

Updated On : September 5, 2019 / 3:08 AM IST

దేశంలో నిమిషానికి 49 మంది పుడుతుంటే 15 మంది కన్నుమూస్తున్నారు. మరణాలు సంభవిస్తున్నప్పటికీ పుట్టుకొస్తున్న శిశువులతో దేశ జనాభా ఏడాది వ్యవధిలో అదనంగా 1.45 కోట్లు పెరిగిందట. దేశవ్యాప్తంగా జనన, మరణాల నమోదు ఆధారంగా జాతీయ జనాభా లెక్కల శాఖ తాజాగా గణాంకాలను విడుదల చేసింది. పౌర నమోదు వ్యవస్థ ద్వారా జనాభా లెక్కలను కేంద్రం విడుదల చేస్తుంది. 2017 జనవరి 1 నుంచి డిసెంబరు 31 వరకూ జనన, మరణాల ఆధారంగా పెరిగిన జనాభా లెక్కలను ప్రకటించింది. ఎవరు మృతి చెందినా, ఏ ఇంట్లో జననం ఉన్నా 21 రోజుల వ్యవధిలో ప్రభుత్వ రికార్డుల్లో నమోదు చేయించాలి. సమీపంలోని గ్రామ పంచాయతీ లేదా పురపాలక కార్యాలయంలో ఈ నమోదు తప్పనిసరి. 

జననాల రేటు గ్రామాల్లో కంటే పట్టణాల్లోనే ఎక్కువగా కనిపిస్తోంది. తెలంగాణలో 2017లో నమోదైన వివరాలను పరిశీలిస్తే.. జనవరి 1 నుంచి డిసెంబరు 31 వరకూ మొత్తం 6,17,620 మంది శిశువులు పుట్టారు. వీరిలో 74.85శాతం అంటే 4,62,297 పట్టణాల్లోజన్మించారు. జిల్లాల వారీ లెక్కల్లో హైదరాబాద్, వరంగల్ అర్బన్, నిజామాబాద్‌లు వరసగా తొలి 3 స్థానాల్లో ఉన్నాయి. వీటిలోనూ అంతర్గతంగా మళ్లీ పట్టణాల్లోనే జననాలు ఎక్కువగా ఉండటం వల్ల ఇవి అగ్రస్థానానికి చేరాయి. 

హైదరాబాద్ రెవెన్యూ జిల్లా అంటే మొత్తం మహానగరంలోని ప్రాంతమే. జనాభా ఎక్కువ అయినందున జననాలు ఎక్కువగా ఉన్నాయని అంచనా. నిజామాబాద్ జిల్లాలో గ్రామీణ ప్రాంతాలు అధికంగా ఉన్నా నగరంలోనే జననాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. 33,716 జననాలతో రాష్ట్రంలోనే రెండోస్థానంలో నిలిచింది నిజామాబాద్. 80.39 శాతం(27,105) జననాలు జిల్లాలోని పట్టణ ప్రాంతాల్లోనే ఉండటం విశేషం. నగర ప్రాంతంతో నిండిన వరంగల్ అర్బన్ జిల్లాలోనూ ఎక్కువగా అంటే 32,410 జననాలతో రాష్ట్రంలో 3వ స్థానంలో ఉంది. వీటిలో 29,425 జననాలు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి. ప్రతి వంద జననాల్లో పల్లెప్రాంతాల్లో ఉన్నవి కేవలం 10 మాత్రమే. 

రాష్ట్రంలోకెల్లా అతితక్కువ జననాలతో జనగామ జిల్లా చిట్టచివరన ఉంది. కానీ చివరికి ఈ జిల్లాలో సైతం మొత్తం 2531 జననాల్లో 76.57 శాతం(1938) పట్టణాల్లోనే ఉన్నాయి. ఈ శాతం రాష్ట్ర సగటు శాతం 74కంటే అధికంగా ఉండటం గమనార్హం. జాతీయ జనాభా లెక్కల శాఖ తాజా గణాంకాలు ఈ విషయాలను స్పష్టం చేశాయి.

  • తెలంగాణలో జిల్లాల వారీగా చూస్తే జనన, మరణాల్లో హైదరాబాద్ రెవెన్యూ జిల్లానే అగ్రస్థానంలో ఉంది. రాష్ట్రంలో 10 వేలకు పైగా మరణాలున్న జిల్లాలు రెండే కాగా అందులో ఒకటి హైదరాబాద్ మరొకటి వరంగల్ అర్బన్.
  • ఏదో ఒక వైద్యశాలలో కన్నుమూసిన వారు 34.5 శాతం, ఎలాంటి వైద్యం సాయం అందక మరణించినవారు 33.9 శాతం. ఇతర కారణాలతో మరో 25 శాతం మంది చనిపోయారు. వయసు వారీగా మరణాలను విశ్లేషిస్తే తెలంగాణలో 65 నుంచి 69 ఏళ్ల మధ్య ఎక్కువ మంది కన్నుమూస్తున్నారు. ఐదేళ్ల వ్యవధిలో 34,278 మరణించారు.