Indigo Crisis: వామ్మో.. హైదరాబాద్ టు ఢిల్లీకి భారీగా పెరిగిన ఫ్లైట్ టికెట్ ధర.. ఎంతో తెలిస్తే గుండె అదరాల్సిందే..!
భారత్ లో అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో. దేశవ్యాప్తంగా రోజుకు దాదాపుగా 2వేల 200 విమాన సర్వీసులు నడుపుతోంది.
Indigo Crisis: ఇండిగో విమాన సర్వీసుల రద్దు ఎఫెక్ట్ ప్రయాణికులపై భారీగానే పడుతోంది. ఇతర విమానయాన సంస్థలు ఈ సంక్షోభాన్ని క్యాష్ చేసుకుంటున్నాయి. విమాన టికెట్ల ధరలను అమాంతం పెంచేశాయి. ఇప్పటికే వేలాది మంది ఎయిర్ పోర్టుల్లో పడిగాపులు కాస్తూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇది చాలదన్నట్లు ఇప్పుడు టికెట్ల ధర మోతతో మరికొంతమంది ప్రయాణికుల లబోదిబో మంటున్నారు. ఇండిగో ఎఫెక్ట్ తో దేశంలో విమాన టికెట్ల ధరలు అమాంతం ఆకాశాన్నంటాయి. సాధారణ రోజులతో పోలిస్తే టికెట్ ధరలు దాదాపు రెండు మూడు రెట్ల పెరగడంతో ప్రయాణికులు గగ్గోలు పెడుతున్నారు.
హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్లాలంటే ఫ్లైట్ టికెట్ ధర 82వేల రూపాయలకు పైనే ఉంది. పైగా రెండు స్టాప్స్ 25 గంటల ప్రయాణ సమయాన్ని చూపిస్తున్నాయి ఫ్లైట్ టికెట్లు బుక్ చేసే వెబ్ సైట్లు. అటు ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు వచ్చే ఫ్లైట్ టికెట్ల ధరలు 48వేల రూపాయలకు పైనే చూపుతున్నాయి. దీంతో ప్రయాణికుల మైండ్ బ్లాంక్ అవుతోంది. దేశంలోనే అత్యంత రద్దీ మార్గాల్లో ఒకటైన ముంబై-ఢిల్లీ మధ్య విమాన సర్వీసుల టికెట్ రేట్లు అమాంతం పెరిగిపోయాయి. ముంబై-ఢిల్లీ, ఢిల్లీ-ముంబై మార్గంలో పలు ఎయిర్ లైన్స్ టికెట్ ధరలు 20వేల నుంచి 40వేల రూపాయల వరకు ఉన్నాయి. మిగిలిన మార్గాల్లోనూ దాదాపుగా ఇదే పరిస్థితి కనిపిస్తోంది.
సాధారణ సమయాల్లో ఢిల్లీ-ముంబై రౌండ్ ట్రిప్ టికెట్ ధరలు చివరి నిమిషంలో బుక్ చేసుకున్నా.. దాదాపుగా 20వేల వరకు ఉంటాయి. ఇప్పుడు ఆ ధర ఏకంగా 60వేలకు పెరగడంతో ప్రయాణికులు బెంబేలెత్తిపోతున్నారు. ముంబై-శ్రీనగర్ మార్గంలో సాధారణ రోజుల్లో 10వేలుగా ఉండే టికెట్ ధర..ఇప్పుడు ఏకంగా 62వేలకు పెరిగింది. రౌండ్ ట్రిప్ అయితే దాదాపు 92వేల వరకు ఉంది.
భారత్ లో అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో. దేశవ్యాప్తంగా రోజుకు దాదాపుగా 2వేల 200 విమాన సర్వీసులు నడుపుతోంది. ఎయిర్ ఇండియాతో పోలిస్తే ఇది రెండింతలు. అలాంటి ఎయిర్ లైన్స్ ఇప్పుడు సాంకేతిక సమస్యలు, సిబ్బందికి సంబంధించిన కొత్త రోస్టర్ నియమాలు, ఇతర కారణాలతో సంక్షోభం ఎదుర్కోంటోంది. దీంతో తన సర్వీసులను క్యాన్సిల్ చేస్తోంది. ఒక్క శుక్రవారమే దాదాపు 500 విమానాలను రద్దు చేసింది. ఇప్పటికే ఢిల్లీ, హైదరాబాద్, చెన్నై సహా పలు ఎయిర్ పోర్టుల్లో ఇండిగో విమాన సర్వీసులు రద్దు కావడం, పలు చోట్ల ఆలస్యంగా నడుస్తుండటంతో ప్రయాణికులు నరకం చూస్తున్నారు.
Also Read: ఇండిగో ఫ్లైట్స్ దెబ్బ.. వాళ్ల రిసెప్షన్ కి వాళ్లే వెళ్లలేకపోయారు.. ఈ కొత్త జంట మరపురాని కథ..
