ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం.. భారత్‌లో పెరగనున్న ఈ వస్తువుల ధరలు!

ఈ యుద్ధం మరింత పెరిగితే.. ఈ ఉత్పత్తుల ధరలపై ప్రభావం తప్పదని భావిస్తున్నారు.

ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం.. భారత్‌లో పెరగనున్న ఈ వస్తువుల ధరలు!

Updated On : June 15, 2025 / 5:00 PM IST

ఇజ్రాయెల్-ఇరాన్ దేశాల మధ్య ఉద్రిక్తత రోజురోజుకీ తీవ్రమవుతోంది. ఇరు దేశాలు పరస్పరం క్షిపణులు, డ్రోన్లతో దాడులు జరుపుకుంటున్నాయి. ఈ పరిస్థితి ఇంకా ముదిరే ప్రమాదం ఉందని రక్షణ రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ యుద్ధం కొనసాగితే మధ్యప్రాచ్యంలో పరిస్థితులు చేజారే ముప్పు ఉంది.

ఈ ఘర్షణ ప్రభావం భారత్‌పైనా పడనుంది. ఇరాన్, ఇజ్రాయెల్‌తో భారత్‌కు బలమైన వాణిజ్య సంబంధాలు ఉండటంతో ఇక్కడి మార్కెట్‌లోనూ ఈ ప్రభావం కనిపించనుంది. ఇరు దేశాలకు భారత్ పలు ఉత్పత్తులను ఎగుమతి చేస్తుంది. అదే విధంగా, వాటి నుంచి కూడా అనేక వస్తువులు దిగుమతి చేస్తుంది. ఈ యుద్ధం ముదరితే కొన్ని వస్తువుల ధరలు పెరిగే అవకాశం ఉన్నదని విశ్లేషకులు చెబుతున్నారు.

భారత్‌ ప్రపంచం నలుమూలల నుంచి 80 శాతం పైగా ముడి చమురు దిగుమతి చేస్తుంది. అయితే ఇరాన్ నుంచి భారతదేశానికి నేరుగా చమురు రాక తక్కువే అయినా, ఆ దేశం ప్రపంచ చమురు సరఫరాలో కీలక పాత్ర పోషిస్తుంది. యుద్ధం ప్రారంభమైన వెంటనే ముడి చమురు ధరలు ఒక్కసారిగా భారీగా ఎగబాకాయి.

ప్రస్తుతం బ్రెంట్ క్రూడ్ ధర 11 శాతం పైగా పెరిగి బ్యారెల్‌కు 75.32 డాలర్లను తాకింది. వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ (WTI) క్రూడ్ ధర 73.42 డాలర్లకు చేరింది. యుద్ధం కొనసాగితే, చమురు ధరలు మరింత పెరిగే ప్రమాదం ఉంది.

ఇజ్రాయెల్ భారతదేశానికి ఒక ముఖ్యమైన వ్యాపార భాగస్వామిగా నిలిచింది. ఆసియాలో భారత్, ఇజ్రాయెల్‌కు రెండో అతిపెద్ద ట్రేడింగ్ దేశంగా ఉండగా, ప్రపంచవ్యాప్తంగా తొమ్మిదవ స్థానంలో ఉంది. నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ దేశంతో ట్రేడ్ మరింత వేగం పుంచుకుంది. ముఖ్యంగా ఎలక్ట్రానిక్ పరికరాలు, హైటెక్ యంత్రాలు, మెడికల్ పరికరాలు, కమ్యూనికేషన్ వ్యవస్థలతో ట్రేడ్ పెరిగింది.

Also Read: ఇది పక్షపాతం కాదా? WTC ఫైనల్ ఎప్పుడూ ఇంగ్లాండ్‌లోనే ఎందుకు? 2031 వరకు ఇంతేనా? క్రికెటర్లు ఆగ్రహం

ఇజ్రాయెల్ నుంచి భారత్‌కు దిగుమతులు

  • ఎలక్ట్రానిక్ పరికరాలు
  • ఆయుధాలు
  • ఆప్టికల్, ఫొటోగ్రఫిక్, టెక్నికల్, మెడికల్ పరికరాలు
  • ఎరువులు
  • యంత్రాలు, న్యూక్లియర్ రియాక్టర్లు, బాయిలర్లు
  • అల్యూమినియం, వివిధ రసాయన ఉత్పత్తులు
  • ముత్యాలు, విలువైన రాళ్లు, లోహాలు, నాణేలు
  • ఆర్గానిక్ రసాయనాలు
  • మౌలిక లోహాలతో తయారు చేసిన పరికరాలు

ఇరాన్‌కు భారత ఎగుమతులు 2024 మార్చి నుంచి 2025 మార్చి మధ్య కాలంలో 47.1 శాతం పెరిగి 88.1 మిలియన్ డాలర్ల నుంచి 130 మిలియన్ డాలర్లకు చేరాయి. ఇక ఇరాన్ నుంచి దిగుమతులు 23.6 శాతం తగ్గి 56.2 మిలియన్ డాలర్ల నుంచి 43 మిలియన్ డాలర్లకు వచ్చాయి.

ఇరాన్ నుంచి భారత్‌కు దిగుమతులు

  • ఆర్గానిక్ కెమికల్స్
  • పండ్లు, గింజలు
  • ముడి చమురు, ఇంధన పదార్థాలు
  • ఉప్పు, గంధకం, భూమి ఖనిజాలు, సిమెంట్
  • ప్లాస్టిక్ పదార్థాలు
  • ఇనుము, ఉక్కు
  • వృక్ష ఆధారిత పదార్థాలు – గమ్‌లు, రెసిన్లు, లాక్ వంటివి

ఈ యుద్ధం మరింత పెరిగితే.. ఎలక్ట్రానిక్ వస్తువులు, ఎరువులు, చమురు, రసాయనాలు, ప్లాస్టిక్ సామాగ్రి, ఇంధనాలు, అల్యూమినియం వంటి ఉత్పత్తుల ధరలపై ప్రభావం తప్పదని భావిస్తున్నారు.