Aditya L-1 : సూర్యుని దగ్గరకు తొలిసారి భారత్ ఉపగ్రహం.. సూర్యునిపై పరిశోధనలకు ఆదిత్య ఎల్-1 ప్రయోగం, ఇస్రో చేపట్టిన తొలి మిషన్
ఇస్రో చేపట్టిన ఆదిత్య ఎల్-1 శాటిలైట్ బరువు 1500 కిలోలు. భూమి నుంచి సూర్యుడి దిశగా 15 లక్షల కిలోమీటర్ల దూరంలోని లెగ్రాంజ్ పాయింట్ ఎల్-1 చుట్టూ ఉన్న కక్ష్యలో దీన్ని ప్రవేశపెట్టనున్నారు. ఆదిత్య ఎల్-1 గ్రహణాలతో సంబంధం లేకుండా సూర్యుడిని నిరంతరం అధ్యయనం చేస్తుంది.

Aditya L-1 Experiment
ISRO Aditya L-1 : చంద్రయాన్ సక్సెస్ తో ఇస్రో మరో ప్రతిష్టాత్మక ప్రయోగానికి సిద్ధమైంది. సూర్యునిపై పరిశోధనల కోసం ఇస్రో ఆదిత్య ఎల్-1 ప్రయోగాన్ని చేపట్టింది. దీనికి కౌంట్ డౌన్ మొదలైంది. శ్రీహరికొటలో శాస్త్రవేత్తలు ఆదిత్య ఎల్-1ను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఇవాళ ఉదయం 11.50 గంటలకు నిప్పులు చిమ్ముకుంటూ ఆదిత్య ఎల్-1తో సూర్యుని వైపు బయల్దేరుతుంది. సూర్యుడిపై పరిశోధనల కోసం ఇస్రో చేపట్టిన ప్రతిష్టాత్మక ప్రయోగం ఆదిత్య ఎల్-1కి రంగం సిద్ధమైంది.
తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి ఈ ప్రయోగం జరుగుతుంది.
ఈ ప్రయోగం నేపథ్యంలో ఆదిత్య ఎల్-1 ఉపగ్రహ ఆకృతిని తీసుకుని ఇస్రో శాస్త్రవేత్తల బృందం తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. అటు ఇస్రో చైర్మన్ సోమనాథ్ సూళ్లూరుపేటలోని చెంగాలమ్మ పరమేశ్వరి ఆలయాన్ని దర్శించుకున్నారు. సూర్యడిని అధ్యయనం చేసేందుకు ఇస్రో చేపడుతున్న తొలి మిషన్ ఇది.
ISRO launch Aditya L1 : సూర్యుడిని టార్గెట్ చేసిన ఇస్రో..ఆదిత్యయాన్‌తో రహస్యం వీడుతుందా?
కరోనా గ్రఫీ పరికరంతో సౌర వాతావరణం లోతుగా పరిశోధించడం ఈ ప్రాజెక్టు ఉద్దేశం. యూరోపియన్ స్పేస్ ఎజెన్సీ, ఆస్ట్రేలియా ఇతర దేశాల అంతరిక్ష సంస్థల సాయంతో సూర్యుడిపై అధ్యయనాలను ఇస్రో చేపడుతోంది. ఇస్రో చేపట్టిన ఆదిత్య ఎల్-1 శాటిలైట్ బరువు 1500 కిలోలు. భూమి నుంచి సూర్యుడి దిశగా 15 లక్షల కిలోమీటర్ల దూరంలోని లెగ్రాంజ్ పాయింట్ ఎల్-1 చుట్టూ ఉన్న కక్ష్యలో దీన్ని ప్రవేశపెట్టనున్నారు.
ఆదిత్య ఎల్-1 గ్రహణాలతో సంబంధం లేకుండా సూర్యుడిని నిరంతరం అధ్యయనం చేస్తుంది.
ఆదిత్య ఎల్-1 మొత్తం 7 పే లోడ్లతో వెళ్తుంది. ఇందులో ప్రధానమైన విజిబుల్ ఎమిషన్ లైన్ కొరోనా గ్రాఫ్ వీఈఎల్ సీతోపాటు సోలార్ అల్ట్రావైలెట్ ఇమేజింగ్ టెలిస్కోప్, ఆదిత్య సోలార్ విండ్ స్పార్టికల్ ఎక్సపర్ మెంట్, ప్లాస్మా ఎనలైజర్ ప్యాకేజీ ఫర్ ఆదిత్య, సోలార్ లో ఎనర్జీ ఎక్స్ రే స్పెక్ట్రో మీటర్, హై ఎనర్జీ ఎల్-1 ఆర్బిటింగ్ ఎక్స్ రే స్పెక్ట్రో మీటర్, మ్యాగ్నటో మీటర్ పే లోడ్లను అమర్చారు.
సూర్యగోళం నుంచి వచ్చే అత్యంత శక్తివంతమైన కాంతి ప్రభావాన్ని అధ్యయనం చేసేందుకు అనువుగా ఈ పేలోడ్ లు ఉన్నాయి. ఈ పే లోడులు ఎలక్ట్రో మ్యాగ్నటిక్, మ్యాగ్నటిక్ ఫీల్డ్ డిటెక్టర్ల సాయంతో సూర్యుడిలోని ఫొటో స్పియర్, క్రోమో స్పియర్, వెలుపల ఉండే కరోనా వంటి పొరలను అధ్యయనం చేస్తాయి. ఎల్-1 ప్రదేశానికి ఉన్న సానుకూలతల నాలుగు పరికరాలు నేరుగా సూర్యుడిని అధ్యయనం చేస్తాయి. మిగతా మూడు పరికరాలు సమీపంలోని సౌర రేణువులు, అయస్కాంత క్షేత్రాల గురించి శోధిస్తాయి.
ఈ ప్రయోగం సక్సెస్ అయితే సూర్యుడి దగ్గరకు శాటిలైట్ పంపిన నాలుగో దేశంగా భారత్ చరిత్రకుకెక్కుతుంది. ఇప్పటిదాకా అమెరికా, జర్మనీ, యూరోపియిన్ ఏజెన్సీ ప్రయోగించిన శాటిలైట్లకు నిర్ణీత కాల పరిమితి ఉంది. ఆదిత్య ఎల్-1కు ఆ పరిమితి లేదు. సూర్యుని బాహ్య వలయాలపై పరిశోధనలు చేస్తోంది. సౌర తుఫానులకు గల కారణాలను అన్వేషిస్తుంది.
Chandrayaan 3 Updates: చంద్రయాన్-3 సక్సెస్.. భారత కీర్తి మరోసారి జగద్వితం..
ప్రయోగాన్ని వీక్షించేందుకు సాధారణ పౌరులకు ఇస్రో అవకాశం కల్పించింది. ఇందుకోసం ముందస్తుగా రిజిస్ట్రేషన్ చేసుకున్నవారు షార్ కేంద్రానికి వెళ్లి ప్రయోగాన్ని వీక్షించవచ్చు. నాలుగు నెలల ప్రయాణం తర్వాత ఆదిత్య ఎల్-1 భూమికి 15 లక్షల కిలో మీటర్ల దూరంలోని లెగ్రాంజ్ పాయింట్ దగ్గరకు చేరుకుంటుంది. అక్కడే స్థిరంగా ఉంటూ నిరంతరం సూర్యునిపై పరిశోధనలు చేస్తోంది.