రేపు సాయంత్రం మధ్యప్రదేశ్ బలపరీక్ష…సుప్రీం

శుక్రవారం(మార్చి-20,2020) కమల్ నాథ్ సర్కార్ మధ్యప్రదేశ్ అసెంబ్లీలో బలపరీక్ష ఎదుర్కోవాల్సిందేనని సుప్రీంకోర్టు ఇవాళ(మార్చి-19,2020)ఆదేశాలు జారీచేసింది. సభ్యులంతా చేతులెత్తి ఓటింగ్ లో పాల్గొనాలని, చాలా ప్రశాంత వాతావరణంలో ఓటింగ్ జరగాలని, విశ్వాస పరీక్షను వీడియో తీయాలని,ప్రొసీడింగ్స్ ను ప్రత్యక్ష ప్రసారం చేయాలని కోర్టు నిర్దేశించింది. శుక్రవారం సాయంత్రం 5 గంటల్లోగా సీఎం కమల్ నాథ్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వ విశ్వాసపరీక్షను ముగించాలని కోర్టు ఆదేశించింది. సుప్రీంకోర్టు తీర్పును ప్రతిపక్ష బీజేపీ నేతలు స్వాగతించారు.
మార్చి 16నే అసెంబ్లీలో సీఎం కమల్ నాథ్ ప్రభుత్వానికి విశ్వాస పరీక్ష జరగాల్సి ఉండగా..కరోనా వైరస్ నేపథ్యంలో స్పీకర్ ప్రజాపతి అసెంబ్లీని మార్చి 26 వరకు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించడంతో విశ్వాస పరీక్ష వాయిదా పడిన విషయం తెలిసిందే. స్పీకర్ నిర్ణయంతో బీజేపీ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. ఈ ఇష్యూలో తక్షణ తీర్మాణం కోరుతూ బీజేపీ వేసిన పిటిషన్ పై విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం ఈ మేరకు తీర్పు వెలువరించింది.
మధ్యప్రదేశ్ కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేలతో సీక్రెట్ చర్చలు జరుపుతున్నట్లు మధ్యప్రదేశ్ సీఎం కమల్ నాథ్ ఇవాళ ఓ న్యూస్ ఛానల్ తో మాట్లాడుతూ తెలిపారు. అసెంబ్లీలో తన సత్తా చూపిస్తానని కమల్ నాథ్ అన్నారు. బలపరీక్షలో విజయం తమదే అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఒకవేళ రెబల్ ఎమ్మెల్యేలు కనుక బ్రెయిన్ వాష్ చేయబడి ఉంటే వాళ్లకు తనకు ఫోన్ చేసేవాళ్లు కాదని సీఎం అన్నారు. రెబల్స్ మద్దతుతో శివరాజ్ సింగ్ చౌహాన్ మరోసారి సీఎం పగ్గాలు చేపట్టబోతున్నారా అన్న ప్రశ్నను ఆయన తోసిపుచ్చారు. శివరాజ్ సింగ్ చౌహాన్ వేసిన గూగ్లీకి తాను బౌల్డ్ కానని కమల్ నాథ్ తెలిపారు.
ఇటీవల కాంగ్రెస్ కు రాజీనామా చేసి బీజేపీలో చేరిన జ్యోతిరాధిత్య సింధియా వర్గానికి చెందిన 20మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో కమల్ నాథ్ సర్కార్ సంక్షోభంలో పడిన విషయం తెలిసిందే. వీరిలో కొందరి రాజీనామాలను ఇప్పటికే స్పీకర్ ఆమోదించారు కూడా. అయితే ప్రస్తుతానికి అధికార కాంగ్రెస్ దగ్గర మెజార్టీ మార్క్ కు తగినంత సంఖ్యాబలం లేదు. రేపటిలోగా ఏదైనా మ్యాజిక్ జరిగితే తప్ప కమల్ నాథ్ సర్కార్ కూలిపోవడం ఖాయంగా కనిపిస్తోంది.