ఆవును చంపితే జైలుకే.. కొత్త చట్టం.. నేటి నుంచే అమల్లోకి!

ఆవును చంపితే జైలుకే.. కొత్త చట్టం.. నేటి నుంచే అమల్లోకి!

Updated On : January 18, 2021 / 11:36 AM IST

Karnataka anti-cow slaughter law:నేటి నుంచి గోవధ నివారణ, సంరక్షణ చట్టం (2020) అమల్లోకి వచ్చింది. ఈ ఆర్డినెన్స్ అమలుతో కర్ణాటక రాష్ట్రంలో ఇకపై ఆవును చంపితే జైలుకు పోక తప్పదు. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర గవర్నర్ వజుభాయ్ వాలా కర్ణాటకలో స్లాటర్ ప్రొటెక్షన్ అండ్ పశువుల సంరక్షణ బిల్లు -2020ను 2020 డిసెంబర్ 9 న రాష్ట్ర అసెంబ్లీలో ఆమోదించారు.

కర్ణాటక శాసనసభ శీతాకాల సమావేశాల్లో భాగంగా ఈ బిల్లు ఆమోదం పొందగా.. ఈ చట్టం ప్రకారం 13 ఏళ్ల లోపు ఆవులు, ఎద్దులు, దున్నలు, గేదెలను వధించడాన్ని తీవ్ర నేరంగా పరిగణిస్తారు. 13 ఏళ్లు దాటిన ఎద్దును పరిశోధన కోసం, లేదా అనారోగ్యం పాలైనట్టు పశువైద్యులు నిర్ధారిస్తే చంపేందుకు అనుమతి ఇస్తారు. అయితే, వాటిని చంపేందుకు ఇతర రాష్ట్రాలు, దేశాలకు తరలించడం కూడా నేరమే.

ఈ నిబంధనలు ఉల్లంఘించి గోవధకు పూనుకుంటే మూడేళ్ల నుంచి ఏడేళ్ల వరకు జైలు శిక్ష తప్పదు. అలాగే, రూ. 50 వేల నుంచి రూ.5 లక్షల వరకు జరిమానా విధిస్తారు. ఇప్పటివరకు గుజరాత్, ఉత్తరప్రదేశ్‌లో ఈ చట్టం అమల్లో ఉండగా కర్ణాటకలో కూడా అమలైంది. ఈ నిర్ణయంతో పశువులను వధించేందుకు సంతల్లో ఆవులు సహా పశువుల క్రయవిక్రయాలను అనుమతించరు.

జంతువులపై క్రూరత్వ నియంత్రణ చట్టం కింద కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖ ఇప్పటికే కొత్త నిబంధనలను నోటిఫై చేసింది. ఈ గెజిట్‌ నోటిఫికేషన్‌ ప్రకారం పశువులను వధించేందుకు విక్రయించడం లేదని లిఖితపూర్వక డిక్లరేషన్‌ లేకుండా పశువుల సంతకు ఏ ఒక్కరూ పశువులను తీసుకురావడం అనుమతించరు.