మాజీ మంత్రి వైజనాథ్ పాటిల్ కన్నుమూత

కర్నాటక మాజీ మంత్రి వైజనాథ్ పాటిల్ కన్నుమూశారు. 81 ఏళ్ల వయస్సున్న బైజనాథ్ శనివారం (నవంబర్ 2,2019)న బెంగుళూరులోని ఫోర్టిస్ హాస్పటల్‌లో వయస్సు సంబంధిత సమస్యలతో బాధపడుతూ తుది శ్వాస విడిచారు. వైజనాథ్‌కు భార్య, ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
వైజనాథ్ కర్నాటక-హైదరాబాద్ పోరాట సమితికి ఆయన అధ్యక్షుడిగా పనిచేశారు. 1984లో సీఎం రామకృష్ణ హెగ్డే ప్రభుత్వం హార్టికల్చర్ మంత్రిగా చేశారు. 1994లో దేవ గౌడ ప్రభుత్వంలో పట్టణాభివృద్ధి మంత్రిగా పనిచేశారు. ఆయన గుల్బర్గా వర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్‌ను అందుకున్నారు.
హైదరాబాద్-కర్నాటక ప్రాంతానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని ఆయన కళ్యాణ కర్నాటక పోరాటాన్ని చేపట్టారు. ఈ ప్రాంత ప్రజలకు విద్యా, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కళ్యాణ కర్నాటక ప్రాంతానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని మల్లిఖార్జున్ ఖర్గే, వైజనాథ్ పాటిల్‌లు సంయుక్తంగా ఉద్యమం చేపట్టారు. వీరి వల్లే పార్లమెంట్‌లో ఆర్టికల్ 371(జే) చట్టాన్ని తీసుకువచ్చారు.
పాటిల్ 81 సంవత్సరాల వయస్సులో కూడా చురుకైన ప్రజా జీవితాన్ని గడిపారు. ప్రజలకు అన్యాయం జరిగిన సమయంలో తన గళాన్ని వినిపించేవారు. ఈ విషయంలో స్వంత పార్టీ నేతలనే కాకుండా ప్రభుత్వాన్నే విమర్శించేవారు. కాంగ్రెస్-జెడి (ఎస్) సంకీర్ణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేసిన వైజనాథ్ పాటిన్ కాంగ్రెస్ ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు.
వైజనాథ్ పాటిల్ బీదర్ జిల్లాలోని హక్యాలా గ్రామంలో వ్యవసాయ కుటుంబంలో జూలై 29, 1938 న జన్మించారు. బీదార్‌లోని బివిబి డిగ్రీ కాలేజ్ నుంచి..గుల్బర్గాలోని ఎస్‌ఎస్‌ఎల్ లా కాలేజీ నుండి ఎల్‌ఎల్‌బి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు.