ముస్లింకి తప్ప ఎవ్వరికైనా బీజేపీ టిక్కెట్ ఇస్తాం…కర్ణాటక మంత్రి

  • Published By: venkaiahnaidu ,Published On : November 30, 2020 / 09:48 PM IST
ముస్లింకి తప్ప ఎవ్వరికైనా బీజేపీ టిక్కెట్ ఇస్తాం…కర్ణాటక మంత్రి

Updated On : November 30, 2020 / 9:49 PM IST

Karnataka minister KS Eshwarappa క‌ర్ణాట‌క గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి కేఎస్ ఈశ్వ‌ర‌ప్ప సంచలన వ్యాఖ్యలు చేశారు. బెళగావి లోక్ సభ ఉప ఎన్నికల్లో ముస్లింలకు బీజేపీ టిక్కెట్ ఇచ్చే ప్రశ్నేలేదంటూ వ్యాఖ్యానించి కొత్త వివాదానికి తెర తీశారు. హిందువులలో ఏ వర్గమైనా పర్వాలేదు. ఎవరికైనా ఇస్తాం..కానీ ముస్లింలకు మాత్రం కచ్చితంగా టికెట్‌ ఇవ్వమని ఈశ్వరప్ప వ్యాఖ్యానించారు.



రెండు నెలల క్రితం బెళగావి లోక్‌సభ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న రైల్వే శాఖ సహాయ మంత్రి సురేష్‌ అంగడీ కరోనా వైరస్‌ కారణంగా కన్నుమూసిన విషయం తెలిసిందే. దీంతో బెళగావి లోక్‌సభ స్థానానికి త్వరలో ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ సందర్భంగా మంత్రి ఈశ్వరప్ప చేసిన వ్యాఖ్యలు వివాదాన్ని రాజేశాయి.



బెళగావి ఎంపీ టికెట్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ ముస్లింలకు కేటాయించే ప్రసక్తిలేదని..బెళగావి హిందూత్వనికి కేంద్రమని అన్నారు. హిందువుల్లోని ఏ కమ్యూనిటీకి అయినా టిక్కెట్ ఇవ్వనున్నట్లు తెలిపారు. కురుబ, లింగాయత్, వక్కలింగా, బ్రాహ్మణ కులాలకు టిక్కెట్ ఇచ్చే అవకాశం ఉందన్నారు. కానీ ముస్లింలకు మాత్రం టికెట్‌ ఇచ్చే ప్రశ్న లేదని ఆయన తెగేసి చెప్పారు.



కాగా, గ‌తంలోనూ ఈశ్వ‌ర‌ప్ప ఇలాంటి వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేయడం గమనార్హం. ఎన్నికల్లో పోటీ చేసేందుకు ముస్లింలకు బీజేపీ టిక్కెట్లు ఇవ్వదు అంటూ గతేడాది ఏప్రిల్ లో కొప్పాల్ లో ఈశ్వరప్ప వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.