రూ.7వేల కోట్ల స్కామ్..! కర్ణాటకలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న మరో కుంభకోణం..
ఇప్పటికే ముడా స్కామ్ తో కర్ణాటక అట్టుడుకుతుండగా.. తాజాగా మరో కుంభకోణం వెలుగు చూడటంతో రాబోయే రోజుల్లో కర్ణాటక రాజకీయాలు మరింత హీట్ ఎక్కనున్నాయి.

Karnataka Covid Scam (Photo Credit : Google)
Karnataka Covid Scam : కోవిడ్ స్కామ్ కర్ణాటక రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. కోవిడ్ మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో గత బీజేపీ సర్కార్ అవకతవకలకు పాల్పడిందని కాంగ్రెస్ ఆరోపణలు గుప్పిస్తోంది. కోవిడ్ పరికరాలు, మెడిసిన్స్ కొనుగోలులో రూ.7వేల 224 కోట్ల స్కామ్ జరిగిందని సిద్ధరామయ్య సర్కార్ భావిస్తోంది. దీంతో ఇవాళ సమావేశమైన కర్ణాటక మంత్రివర్గం.. కోవిడ్ కుంభకోణంపై క్యాబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది. కోవిడ్ స్కామ్ కు సంబంధించి క్యాబినెట్ సబ్ కమిటీ పూర్తి స్థాయిలో అన్ని వివరాలు సేకరించనుందని కర్ణాటక మంత్రి పాటిల్ తెలిపారు.
ఇప్పటికే ఈ స్కామ్ కు సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ జరిపిన సిట్ 11 పేజీలతో కూడిన నివేదికను ఆగస్టు 31న ప్రభుత్వానికి సమర్పించింది. ఆ రిపోర్టులో 7వేల 224 కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని సిట్ అంచనా వేసింది. బృహత్ బెంగళూరు మహానగర పాలికెలోని 4 జోన్లతో పాటు రాష్ట్రంలోని 31 జిల్లాల్లో ఉన్న సంబంధిత శాఖల నుంచి 55వేల ఫైళ్లను తెప్పించుకుని పరిశీలించింది. అనంతరం ప్రభుత్వానికి పాక్షిక నివేదికను సిట్ సమర్పించింది. దీంతో రికవరీ ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని, అవినీతికి పాల్పడిన సంస్థలను బ్లాక్ లిస్ట్ చేయాలని అధికారులను ఆదేశించింది సిద్ధరామయ్య సర్కార్. ఈ స్కామ్ పై అధికారులు నిష్పక్షపాతంగా విచారణ చేస్తారని మంత్రి పాటిల్ తెలిపారు.
Also Read : కాంగ్రెస్‌ను దెబ్బతీస్తున్నది ఏంటి, హరియాణా ఫలితాలు ఏం సూచిస్తున్నాయి?
ఇక మైనింగ్ లో అక్రమాలపైనా దర్యాఫ్తు చేయడానికి కర్ణాటక లోకాయుక్తలో ఏర్పాటు చేసిన సిట్ పదవీ కాలాన్ని మరో ఏడాది పొడిగించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రాష్ట్రంలోని వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదైన 43 క్రిమినల్ కేసులను కూడా ఉపసంహరించుకోవాలని మంత్రివర్గం నిర్ణయించింది. కర్ణాటక రాజకీయాల్లో ముడా స్కామ్ తీవ్ర దుమారం రేపుతున్న వేళ.. కోవిడ్ పరికరాలకు సంబంధించి భారీ స్కామ్ వెలుగు చూసింది. కరోనా సమయంలో కర్ణాటకలో భారీ స్థాయిలో అక్రమాలు జరిగినట్లు తేలింది.
గత బీజేపీ పాలనలో.. కోవిడ్ పై పోరాటానికి కేటాయించిన కోట్లాది రూపాయల నిధులు దుర్వినియోగం చేసినట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. కోవిడ్ సమయంలో కర్ణాటక సర్కార్ 13వేల కోట్ల రూపాయలను వెచ్చించింది. అయితే, ఈ వివరాలను కర్ణాటక సర్కార్ అధికారికంగా వెల్లడించలేదు. ఇప్పటికే ముడా స్కామ్ తో కర్ణాటక అట్టుడుకుతుండగా.. తాజాగా కోవిడ్ స్కామ్ వెలుగు చూడటంతో రాబోయే రోజుల్లో కర్ణాటక రాజకీయాలు మరింత హీట్ ఎక్కనున్నాయి.
Also Read : పార్సీ అయినప్పటికీ.. రతన్ టాటా భౌతికకాయాన్ని రాబందులకు ఎందుకు ఆహారంగా పెట్టలేదు?