వారి వైఖరి నచ్చలేదట : తీవ్ర మనస్తాపం చెందిన అద్వాణీ

గాంధీనగర్ సీటు కేటాయింపు విషయంలో బీజేపీ నాయకులు వ్యవహరించిన తీరుపట్ల బీజేపీ కురువృద్ధుడు ఎల్ కే అద్వానీ తీవ్ర మనస్తాపానికి గురయ్యారు.గాంధీనగర్ సీటు కేటాయించకపోవడం కన్నా బీజేపీ నేతలు వ్యవహరించిన తీరు ఆయనను ఆందోళనకు గురి చేసిందని అడ్వాణీ సన్నిహిత వర్గాలు తెలిపాయి.గాంధీనగర్ నుంచి టికెట్ నిరాకరించారని ఆయనకు తెలీదు. ఏ ఒక్కరూ ఆయనకు ఈ విషయం గురించి సమాచారం ఇవ్వలేదు. భాజపా నేతలు ఆయన పట్ల అమర్యాదగా వ్యవహరించారు.అద్వాణీకి ఎంతో ఇష్టమైన గాంధీ నగర్‌ను ఎవరికివ్వాలనే విషయంపైనా ఆయనతో చర్చించలేదు. జాబితా ప్రకటించిన తర్వాత ఇప్పటివరకు బీజేపీ పెద్దలెవరూ ఆయనతో మాట్లాడలేదు. ఆయనకు దేశ రాజకీయాల్లో ఎంతో అనుభవం ఉంది. ఆయనను వారు అగౌరవ పరిచారు. ఇదే ఆయనను బాధించేలా చేసింది’ అని అద్వాని సన్నిహితుడొకరు తెలిపారు.
ఇటీవల బీజేపీ 184మంది లోక్ సభ అభ్యర్థులతో కూడిన జాబితాను విడుదల చేసింది.ఈ జాబితాలో అద్వాణీ పేరు లేదు.అద్వాణీ ప్రాతినిధ్యం వహిస్తున్న గుజరాత్ లోని గాంధీనగర్ నుంచి అమిత్ షా పేరు ఈ జాబితాలో ప్రకటించారు.అయితే ఈ జాబితా ప్రకటించడానికి ముందు బీజేపీ నేషనల్ జనరల్ సెక్రటరీ రామ్ లాల్ పార్టీలోని కొందరు వ్యక్తులను కలిసి ప్రత్యక్ష రాజకీయాల నుంచి రిటైర్ అవుతున్నట్లు ప్రకటించాలని కోరారని,అయితే ఎవరైనా పార్టీలోని సీనియర్ లీడర్ వారితో మాట్లాడాల్సిందని,అలాంటిదేమీ జరుగలేదని తెలిపారు.
ఈ ఎన్నికల్లో పోటీ చేసేది లేదంటూ ఇప్పటికే కొందరు బీజేపీ నేతలు ప్రకటించారు. కొందరి పేర్లు బీజేపీ ప్రకటించనే లేదు. సుమిత్రా మహాజన్ పోటీ మీదా ఉత్కంఠ ఏర్పడింది. ఇటీవల మధ్యప్రదేశ్‌లో బీజేపీ విడుదల చేసిన అభ్యర్థుల జాబితాలో లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ పేరు లేదు. మరోవైపు మురళీ మనోహర్ జోషీది ఇదే పరిస్థితి. ఆయన కాన్పూర్‌నుంచి పోటీ చేస్తారా లేదా అనేది ఇంతవరకు భాజపా నిర్ధారించలేదు.