Lock Down : దేశంలోని 14 రాష్ట్రాల్లో లాక్ డౌన్

కరోనా కట్టడి, నివారణకు దేశంలోని 14 రాష్ట్రాల్లో లాక్ డౌన్ విధించాయి.

Lock Down : దేశంలోని 14 రాష్ట్రాల్లో లాక్ డౌన్

Lock Down In 14 States Of The Country

Updated On : May 8, 2021 / 5:41 PM IST

Lock down in 14 states of the country : దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభణ కొనసాగుతోంది. దేశ వ్యాప్తంగా భారీగా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. నిత్యం లక్షల సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. దీంతో పలు రాష్ట్రాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. కరోనా కట్టడి, నివారణకు దేశంలోని 14 రాష్ట్రాల్లో లాక్ డౌన్ విధించాయి. కేరళలో ఈనెల 16 వరకు పూర్తిస్థాయి లాక్ డౌన్, ఢిల్లీలో ఈనెల 10 వరకు లాక్ డౌన్ విధించారు. మధ్యప్రదేశ్ లో ఈనెల 15 వరకు పూర్తిస్థాయి లాక్ డౌన్ విధించారు.

యూపీలో ఈనెల 10 వరకు లాక్ డౌన్ కొనసాగుతోంది. హిమచాల్ ప్రదేశ్ లో ఈనెల 16 వరకు లాక్ డౌన్ విధిస్తున్నట్లు ప్రకటించారు. తమిళనాడులో ఈనెల 10 నుంచి 24 వరకు లాక్ డౌన్ విధించారు. కర్నాటకలో ఈనెల 10 నుంచి 24 వరకు లాక్ డౌన్ ప్రకటిస్తూ నిర్ణయం తీసుకున్నారు. రాజస్థాన్ లో ఈనెల 10 నుంచి 24 వరకు లాక్ డౌన్ ఉంటుంది.

కోవిడ్ కేసుల వ్యాప్తిని అరికట్టడానికి రాష్ట్రంలో 14 రోజుల పూర్తి లాక్ డౌన్ విధించాలని తమిళనాడు ప్రభుత్వం నిర్ణయించింది. లాక్ డౌన్ మే 10 నుండి ప్రారంభమై మే 24 వరకు కొనసాగుతుందని వెల్లడించింది. తమిళనాడులో కోవిడ్ -19 కేసులు పెరగడం వల్ల రాష్ట్రంలో “అనివార్యమైన పరిస్థితుల” కారణంగా షట్డౌన్ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది.

మే 10 నుండి కూరగాయలు, మాంసం, చేపల దుకాణాలు, తాత్కాలిక దుకాణాలు మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే తెరిచి ఉంటాయని పేర్కొంది. మిగతా అన్ని షాపులను మూసివేయాలని ఆదేశించింది. ప్రభుత్వ యాజమాన్యంలోని మద్యం షాపులు మూసివేయబడతాయని పేర్కొంది.. తమిళనాడులో 14 రోజుల పూర్తి లాక్డౌన్ సమయంలో, అవసరమైన సేవలను మాత్రమే ఆపరేట్ చేయడానికి అనుమతిస్తారు. లాక్డౌన్ సమయంలో పెట్రోల్ ,డీజిల్ బంకులు తెరిచి ఉంటాయని స్పష్టం చేసింది.

కోవిడ్ కేసుల పెరుగుదల కారణంగా కర్ణాటక ప్రభుత్వం రాష్ట్రంలో రెండు వారాల లాక్డౌన్ ప్రకటించింది. లాక్డౌన్ మే 10 ఉదయం 6 గంటల నుండి మే 24 ఉదయం 6 గంటల వరకు ఉంటుందని శుక్రవారం విడుదల చేసిన ఉత్తర్వుల్లో బిఎస్ యెడియరప్ప ప్రభుత్వం తెలిపింది. నిత్యావసర వస్తువులు,అత్యవసర సేవలకు మాత్రమే అనుమతి ఉంటుందని పేర్కొంది. కిరాణాసరుకులు విక్రయించే దుకాణాలు ఉదయం 6 నుండి సాయంత్రం 6 గంటల వరకు తెరిచి ఉంటాయని ప్రభుత్వం తెలిపింది.

రహదారి మరమ్మతు పనులు, కార్గో వాహనాలు లాక్డౌన్ సమయంలో కొనసాగించడానికి అనుమతి ఉంటుందని పేర్కొంది. షాపులు,హోటళ్ళు, పబ్బులు, బార్‌లు మూసివేయాలని ఆదేశించింది. ఇక ఇప్పటికే షెడ్యూల్ చేసిన విమానాలు మరియు రైళ్లు లాక్డౌన్ సమయంలో నడుస్తాయని కర్ణాటక ప్రభుత్వం పేర్కొంది. ఇటీవలి రోజుల్లో కోవిడ్ కేసులు పెరుగుతున్న రాష్ట్రాలుగా కేంద్రం గుర్తించిన రాష్ట్రాల జాబితాలో కర్ణాటక కూడా ఉంది. గత 24 గంటల్లో రాష్ట్రంలో 48,781 తాజా కేసులు నమోదయ్యాయి.