EVMలలో అభ్యర్థుల భవితవ్యం : ముగిసిన రెండో దశ లోక్ సభ పోలింగ్

  • Published By: madhu ,Published On : April 18, 2019 / 11:58 AM IST
EVMలలో అభ్యర్థుల భవితవ్యం : ముగిసిన రెండో దశ లోక్ సభ పోలింగ్

Updated On : April 18, 2019 / 11:58 AM IST

రెండో దశ లోక్‌సభ పోలింగ్ ముగిసింది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సాయంత్రం 4గంటలకే ఎన్నికలను ముగించారు అధికారులు. తమిళనాడులోని మధురైలో మాత్రం రాత్రి 8గంటల వరకు పోలింగ్ కొనసాగించేందుకు అనుమతిచ్చారు. ఈవీఎంలను పటిష్టమైన భద్రత నడుమ స్ట్రాంగ్ రూంలకు తరలిస్తున్నారు. పోలింగ్ సమయం కంటే క్యూ లైన్లో వేచి ఉన్న వారికి ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నారు. మొత్తంగా 60 శాతం ఓటింగ్ నమోదైందని అధికారులు భావిస్తున్నారు. 

ఏప్రిల్ 18వ తేదీ గురువారం తమిళనాడులోని 38 పార్లమెంట్, 18 అసెంబ్లీ స్థానాలు, ఒడిషాలోని 5 లోక్‌సభ, 35 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. రెండో విడతలో మొత్తం 13 రాష్ట్రాల్లో 95 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. పశ్చిమబెంగాల్‌లోని రాయ్‌గంజ్‌లో ఉద్రిక్తతల  మధ్యే ఓటింగ్ ముగిసింది. ఎన్నికల పోలింగ్‌లో చెదురుముదురు ఘటనలు జరిగాయి. మాండ్య నియోజకవర్గంలో కుమార స్వామి, సుమలత వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.

రాయ్ గంజ్ ఎంపీ అభ్యర్థి సలీం కారుపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. శాంతి భద్రతలను కాపాడడంలో ఈసీ వైఫల్యం చెందిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. పశ్చిమ బెంగాల్‌లో 300 ప్రాంతాల్లో టీఎంసీ కార్యకర్తలు రిగ్గింగ్ చేశారని ఈసీ దృష్టికి తీసుకెళ్లాయి కొన్ని పార్టీలు. శాంతిభద్రతలకు విఘాతం కలిగే విధంగా అల్లర్లు మాత్రం జరగలేదు. చత్తీస్ గడ్, కర్ణాటక రాష్ట్రాల్లో ఎన్నికల విధులు నిర్వహిస్తున్న ఇద్దరు అధికారులు మరణించారు. అస్సాం, ఒడిషాలో ఈవీఎంలు మొరాయించడంతో మరలా రీ పోలింగ్ జరపాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది.