మాజీ ప్రధాని కుటుంబ ఆలయంలో ఐటీ సోదాలు!

జేడీఎస్ అధినేత,మాజీ ప్రధాని దేవెగౌడ స్వగ్రామం హాసన్ జిల్లాలోని హరదనహళ్లిలో గౌడ కుటుంబానికి చెందిన శివాలయంలో శుక్రవారం(ఏప్రిల్-12,2019) ఐటీ రైడ్స్ జరిగాయి.ఆలయంలో ఐటీ సోదాలు నిర్వహించడంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తున్నాయి.దీనిపై జేడీఎస్-కాంగ్రెస్ కూటమి తీవ్ర నిరసన వ్యక్తం చేస్తోంది. పురాతన ఆలయంలో ఐటీ దాడులు నిర్వహించిన అధికారులను వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు.
ఐటీ దాడులకు సంబంధించి ఆలయ పూజారి భార్య మీడియాతో మాట్లాడుతూ….ఇద్దరు ఐటీ అధికారులు శివాలయం పక్కన ఉన్న మా ఇంటికి వచ్చి తనిఖీలు చేశారు. తరవాత ఆలయ పరిసరాల్లోకి ప్రవేశించి సోదాలు మొదలు పెట్టారు.అత్యంత పవిత్రమైన గర్భగుడిలోకి కూడా ప్రవేశించడానికి ప్రయత్నించారు. దానికి మేం అనుమతించలేదు. ఆలయంలో సోదాలు నిర్వహించి ఖాళీ చేతులతో వెనుదిరిగారని ఆమె చెప్పారు. దేవెగౌడ కుటుంబానికి చెందిన సొమ్మును ఇక్కడ ఉంచారా అంటూ తనను ప్రశ్నించారని ఆమె తెలిపారు.
ఐటీ దాడులపై దేవెగౌడ కొడుకు, కర్ణాటక సీఎం కుమారస్వామి తీవ్రంగా స్పందించారు.తుమకూరులో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడుతూ…ఐటీ అధికారులు హిందూ ఆలయాలను కూడా వదలడం లేదు. హిందూ పార్టీ అని చెప్పుకొనే బీజేపీ…ఈ రోజు మా కుటుంబానికి చెందిన ఆలయంలో సోదాలు నిర్వహించింది. గతంలో ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు. ఇప్పుడు హద్దులు దాటి ఆలయాల్లోకి ప్రవేశించారు ఈ అపవిత్రమైన చర్యతో దేవుడు బీజేపీని రూపుమాపుతాడన్నారు. ఎన్నికల సమయంలో విపక్షాలను బీజేపీ ఐటీ దాడులతో వేధింపులకు గురిచేస్తోందని ఆయన ఆరోపించారు.అయితే తాము ఎలాంటి సోదాలు నిర్వహించలేదని,కొంతమంది కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఐటీ పీఆర్ వో ఓ ప్రకటన విడుదల చేశారు.