దిగజారుడు రాజకీయాలు…పంజాబ్ సీఎంపై ఢిల్లీ సీఎం ఫైర్

Arvind Kejriwal Hits Out At Amarinder Singh పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ పై ఫైర్ అయ్యారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. ఢిల్లీలో ఆప్ ప్రభుత్వం నల్ల చట్టాలు(నూతన అగ్రి చట్టాలు)పాస్ చేసిందని పంజాబ్ సీఎం తనపై ఆరోపణలు చేశారని కేజ్రీవాల్ పేర్కొన్నారు. ప్రస్తుతం నెలకొన్న సున్నితమైన పరిస్థితుల్లో ఇలాంటి దిగజారుడు రాజకీయాలు ఎలా చేయగల్గుతున్నారంటూ అమరీందర్ ని ప్రశ్నించారు కేజ్రీవాల్. ఆ చట్టాలను అమలుచేయడం రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినది కాదని..అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినది అయితే దేశంలోని రైతులు కేంద్రంతో ఎందుకు చర్చలు జరుపుతున్నారని కేజ్రీవాల్ అన్నారు.
ఢిల్లీలోని తొమ్మిది స్టేడియాలను ఓపెన్ జైళ్లుగా మార్చేందుకు తాము అనుమతించలేదనే కారణంతోనే పంజాబ్ సీఎం తనపై ఆరోపణలు చేశారని కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఈ స్టేడియాలలో రైతులను ఉంచాలని కేంద్రం కూడా ఆలోచించిందని తెలిపారు. అయితే,స్టేడియాలను జైళ్లుగా మార్చేందుకు తాను అనుమతించకపోవడంతో వారు నిరాశచెందారని ఆప్ అధినేత తెలిపారు.
మరోవైపు, ఢిల్లీ ప్రభుత్వం రైతు చట్టాలను పాస్ చేస్తోందంటూ పూర్తిగా అవాస్తమైన ఆరోపణలు చేసేందుకు పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్,భారతీయ జనతా పార్టీ చేతులు కలిపాయని ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్ యూనిట్ మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొంది.
కాగా, కేంద్రం ఆమోదించిన నూతన వ్యవసాయ చట్టాలను ఢిల్లీ ప్రభుత్వం అసెంబ్లీలో నోటిఫై చేసిందంటూ మీడియా రిపోర్ట్ లు బయటకిరావడంతో కాంగ్రెస్,ఆప్ నేతల మధ్యల మాటల యుద్ధం కొనసాగుతోంది. అయితే మీడియాలో వచ్చిన ఆ రిపోర్ట్ లు ఫేక్ అని తెలుస్తోంది. అయితే, ఇదే సమయంలో ఢిల్లీ ప్రభుత్వంపై పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు.
వారికి సిగ్గు లేదా? కేంద్రం చేసిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పంజాబ్ లో చేసిన విధంగా ఢిల్లీ అసెంబ్లీలో ఏదైనా సవరణ చేయడంలో వాళ్లు విఫలమయ్యారు. ఇప్పుడు అగ్రి చట్టాలను అధికారికంగా నోటిఫై చేశారు. ఆప్ ప్రభుత్వపు నిజమైన ఉద్దేశ్యం మరియు అనుబంధం బయటపడింది అని అమరీందర్ సింగ్ విమర్శించారు.