వారు అర్హులు కాదా : భారతరత్నపై ఒవైసీ వ్యాఖ్యలు

హైదరాబాద్ : భారతరత్న అవార్డుల ఎంపికపై ఎఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మహారాష్ట్ర కళ్యాణ్‌లో జరిగిన బహుజన సభలో ఒవైసీ మాట్లాడుతూ దళితులు, ముస్లిములు, గిరిజనులలో ఎందరికి భారతరత్న ఇచ్చారనీ..వారిలో భారతరత్నం అవార్డుకు అర్హులు కాదా అంటు ప్రశ్నించారు. ఇప్పటివరకు భారతరత్న పురస్కారాలకు ఎంపికైన వారిలో దళితులు, గిరిజనులు, ముస్లిములు, నిరుపేదలు, అగ్రవర్ణాల వారు, బ్రాహ్మణులు ఎందరున్నారో చెప్పండని నిలదీసారు.. బాబాసాహెబ్ భీమ్‌రావు అంబేద్కర్‌కు భారతరత్న అవార్డు ఇచ్చారు కానీ మనస్ఫూర్తిగా ఇవ్వలేదని ఒవైసీ వ్యాఖ్యానించారు. అంబేద్కర్ మరో 15 ఏళ్లు జీవించి ఉంటే దేశం పరిస్థితి ఇలా ఉండేది కాదన్నారు. అంబేద్కర్ కలలను సాకారం చేయడానికి జాగృతం కావాలని బహుజనులకు ఓవైసీ పిలుపునిచ్చారు.