Retire At 75: 75ఏళ్లకు రిటైర్మెంట్.. రాజకీయ దుమారం రేపిన ఆర్ఎస్ఎస్ చీఫ్ వ్యాఖ్యలు.. ప్రధాని మోదీని టార్గెట్ చేసిన కాంగ్రెస్..

ప్రధాని మోదీని ఉద్దేశించే భగవత్‌ ఈ వ్యాఖ్యలు చేశారని విమర్శలు చేస్తున్నారు. ఒక్క దెబ్బకు.. రెండు పిట్టలు అంటూ సెటైర్లు వేస్తున్నారు.

Retire At 75: 75ఏళ్లకు రిటైర్మెంట్.. రాజకీయ దుమారం రేపిన ఆర్ఎస్ఎస్ చీఫ్ వ్యాఖ్యలు.. ప్రధాని మోదీని టార్గెట్ చేసిన కాంగ్రెస్..

Updated On : July 11, 2025 / 5:43 PM IST

Retire At 75: రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) చీఫ్ మోహన్ భగవత్ ఇటీవల చేసిన ప్రకటన బీజేపీ శ్రేణులతో పాటు రాజకీయవర్గాల్లో దుమారం రేపింది. 75ఏళ్లకు రిటైర్మెంట్ అంటూ ఆయన చేసిన కామెంట్స్ పొలిటికల్ సర్కిల్స్ లో చర్చకు దారితీశాయి. నాయకులు 75 ఏళ్ల వయసు వచ్చాక పక్కకు తప్పుకోవాలన్నారు మోహన్ భగవత్. పని చేసేందుకు వేరే వాళ్లకు అవకాశం ఇవ్వాలని ఆయన స్పష్టం చేశారు. 75ఏళ్లకు రిటైర్మెంట్ గురించి భగవత్ చేసిన వ్యాఖ్యలపై ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ స్పందించింది. భగవత్ వ్యాఖ్యలతో ప్రధాని మోదీని టార్గెట్ చేసింది. మోదీని ఉద్దేశించే భగవత్‌ ఈ వ్యాఖ్యలు చేశారని చెబుతోంది.

జూలై 9న నాగ్‌పూర్‌లో సీనియర్ ఆర్‌ఎస్‌ఎస్ సిద్ధాంతకర్త మోరోపంత్ పింగళేపై పుస్తక ఆవిష్కరణ సందర్భంగా, బృందావన్‌లో జరిగిన సంఘ్ సమావేశంలో మోహన్ భగవత్ మాట్లాడారు. ఈ సందర్భంగా రిటైర్మెంట్‌పై మోరోపంత్ పింగళే అభిప్రాయాన్ని ఆయన ప్రస్తావించారు. ‘‘75 ఏళ్లు శాలువా మన మీద కప్పారంటే.. మనం ఒక నిర్దిష్ట వయసుకు చేరుకున్నామని అర్థం. అప్పుడు మనం పక్కకు జరిగి.. వేరే వాళ్లు పనిచేసేందుకు అవకాశం ఇవ్వాలి’’ అని పింగళే వ్యాఖ్యలను భగవత్‌ గుర్తుచేశారు. ఇది కాస్తా చర్చనీయాంశంగా మారింది.

నాడు సన్మాన కార్యక్రమంలో వేదికపై మాట్లాడమని పింగళేని అడిగినప్పుడు, ఆయన ఏం అన్నారో భగవత్ గుర్తు చేశారు. “నేను నిలబడినప్పుడు ప్రజలు నన్ను చూసి నవ్వడం ప్రారంభించారు. ఎందుకంటే ప్రజలు నన్ను సీరియస్‌గా తీసుకోవడం లేదని నేను భావిస్తున్నాను. మీరు నాకు 75 సంవత్సరాల వయసులో ఈ శాలువా ఇచ్చారు, కానీ దాని అర్థం నాకు తెలుసు. 75 సంవత్సరాల వయసులో శాలువా కప్పుకున్నప్పుడు, మీరు వృద్ధులయ్యారని అర్థం, పక్కకు వెళ్లిపోండి, మనం దానిని చేద్దాం” అని నాడు పింగళే అన్నట్లు భగవత్ తెలిపారు.

Also Read: ఫాస్ట్‌ట్యాగ్ వాడే వారికి కేంద్రం బిగ్ బ్రేకింగ్ న్యూస్.. ఇక నుంచి అలాంటి ఫాస్ట్ ట్యాగ్స్ అన్నీ బ్లాక్ లిస్ట్‌లో.. బీ కేర్‌ ఫుల్

భగవత్ వ్యాఖ్యల ఆధారంగా ప్రధాని మోదీని టార్గెట్ చేసింది కాంగ్రెస్. ఈ ఏడాది సెప్టెంబర్ తో ప్రధాని మోదీకి 75 ఏళ్లు నిండుతాయని, ఆయనను ఉద్దేశించే భగవత్‌ ఈ వ్యాఖ్యలు చేశారని కాంగ్రెస్‌ నేతలు విమర్శలు చేస్తున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ 17 నాటికి మోదీకి 75 ఏళ్లు పూర్తవుతాయనే విషయాన్ని ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ గుర్తు చేస్తున్నారని, ఇక ఆయన రిటైర్ అవ్వాల్సిందేనని చెబుతున్నారు. అంతేకాదు భగవత్‌కు కూడా ఈ ఏడాది సెప్టెంబర్‌ 11 నాటికి 75 ఏళ్లు నిండుతాయనే విషయాన్ని మోదీ గుర్తు చేయాలని కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి జైరాం రమేశ్‌ అన్నారు. ఒక్క దెబ్బకు.. రెండు పిట్టలు అంటూ సెటైర్ వేశారు.

మార్చిలో ప్రధాని మోదీ నాగ్‌పుర్‌లోని ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించిన సమయంలోనే ఆయన రిటైర్మెంట్‌ గురించి చర్చ మొదలైంది. అప్పట్లో దీనిపై శివసేన (యూబీటీ) ఎంపీ సంజయ్‌రౌత్‌ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ‘‘గత పదేళ్లలో మోదీ ఎన్నడూ ఈ కార్యాలయానికి రాలేదు. దేశ నాయకత్వంలో మార్పు రావాలని ఆర్‌ఎస్‌ఎస్‌ కోరుకుంటోంది. ఆ సంస్థ నియమాల ప్రకారం మోదీ కూడా రాజకీయాలకు రిటైర్మెంట్‌ ప్రకటించాలని సంఘ్‌ భావిస్తోంది’’ అని రౌత్‌ అన్నారు. అయితే రౌత్ వ్యాఖ్యలను బీజేపీ తోసిపుచ్చింది. దాంతో ఆ వ్యవహారం సద్దుమణిగింది. తాజాగా మోహన్ భగవత్‌ చేసిన వ్యాఖ్యలతో మరోసారి మోదీ రిటైర్మెంట్ అంశం తెర మీదకు వచ్చింది.