కవల పిల్లలను ఎత్తుకెళ్లిన కోతులు..శిశువు మృతి

కవల పిల్లలను ఎత్తుకెళ్లిన కోతులు..శిశువు మృతి

Updated On : February 14, 2021 / 11:51 AM IST

Monkies picked up the twins : తమిళనాడులో కోతి చేష్టలు ఓ శిశువు ప్రాణం తీశాయి. ఇంట్లో పడుకోబెట్టిన కవల శిశువులను కోతులు ఎత్తుకెళ్లి.. ఒకరిని కందకంలో విసిరేసి, మరొకరిని ఇంటి పైకప్పుపై వదిలేసి వెళ్లాయి. ఒక పాప చనిపోగా మరోపాప ప్రాణాలతో బయటపడింది. ఈ హృదయ విదారక ఘటన తంజాపూర్ జిల్లాలో చోటుచేసుకుంది.

తంజాపూర్ మేలవీధిలోని కోట్టై అగళి ప్రాంతానికి చెందిన రాజ, భువనేశ్వరి కవల ఆడపిల్లలకు జన్మనిచ్చారు. శనివారం ఇంట్లో చాపపై శిశువులను పడుకోబెట్టి ఆమె స్నానికి వెళ్లారు. కొద్దిసేపటికి కోతుల గుంపు వచ్చిన శబ్ధం వినిపించింది. వెంటనే భువనేశ్వరి ఇంట్లోకి వెళ్లి చూడగా శిశువులు కనిపించలేదు.

బయటకు వెళ్లి వెతుకుతున్న సమయంలో ఇంటి పైకప్పు నుంచి శిశువు ఏడుపు వినిపించింది. ఇంటిపై కూర్చున్న కోతి చేతిలో పాప ఉండటాన్ని గమనించిన ఆమె ఏడుస్తూ కేకలు వేసింది. ఆ అలజడికి ఇరుగు పొరుగు వారు కోతిని తరమడంతో శిశువును వదిలి పారిపోయింది.

మరో శిశువు కోసం వెతుకుతుండగా ఇంటి వెనుక కందకం నీటిలో స్పృహ కోల్పోయి కనిపించింది. ఆ శిశువును హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. కవలపిల్లల్లో ఒకరు చనిపోవడంతో రాజ, భువనేశ్వరి దంపతులు బోరున విలపించారు.