మత పిచ్చికి పరాకాష్ఠ: ముస్లిం ఖైదీపై ‘ఓం’ గుర్తు వచ్చేలా వాతలు

బాధ్యతగా వ్యవహరించాల్సిన ప్రభుత్వ అధికారులే మతాలు..కులాలు అని సామాన్య ప్రజానీకాన్ని పీడించుకుని తింటుంటే ఇక జనజీవనం సాగేదెలా. అందరి కంటే పోలీసు వ్యవస్థ అంటే ఓ నమ్మకం.. ధైర్యం ఉండాల్సిన చోటే నియంతలా వ్యవహరిస్తుంటే ప్రాణాలు ఎట్టా కాపాడుకునేది.
తప్పు చేసి జైలుకు వచ్చాడని ఖైదీపై ఇష్టారాజ్యంగా వ్యవహరించాడు ఆ జైల్ సూపరిండెంట్.. వీపుపై ఓంకారం గుర్తు వచ్చేలా కాల్చాడు. రెండు రోజుల పాటు తిండి పెట్టకుండా కడుపు కాలేలా చేశాడు. ఈ ఘటన తీహార్ జైలులో చోటు చేసుకుంది. బాధితుడి కుటుంబీకులు చేసేది లేక మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేయడంతో విషయం ఢిల్లీ కోర్టు వరకూ వెళ్లింది.
దీనిపై విచారణ జరపాలని ఢిల్లీ కోర్టు ఆదేశించింది. నబ్బీర్ అనే ఖైదీని జైలు సూపరిండెంట్ రాజేశ్ చౌహన్ శారీరకంగా హింసిస్తున్నాడు. ఖైదీ ద్వారా సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు కౌన్సిల్ కు సమాచారం అందించడంతో కోర్టుకు అప్లికేషన్ చేరింది.
ఈ విషయం కోర్టు ఇలా స్పందించింది. ‘బాధితుడి ఆరోపణలను బట్టి అధికారి చాలా క్రూరంగా ప్రవర్తించాడు. జైలు హెడ్ క్వార్టర్‌లో ఉన్న డీజీపీకి నోటీసు పంపించాం. ఖైదీ నబ్బీర్‌కు వైద్య పరీక్షలు చేయాలని ఆదేశించాం. వెంటనే ఈ కేసుపై విచారణ జరపాలని తెలిపాం. ఓం గుర్తు వచ్చేలా కాల్చిన అంశంపై త్వరలో తీర్పు వెలువడుతుంది. సీసీటీవీ కెమెరాలను పరిశీలించి అవసరమైతే సూపరిండెంట్ తప్పిస్తాం’ అని వెల్లడించింది.