Hasnuram Ambedkari : 100 సార్లు పోటీ చేయడమే నా లక్ష్యం.. 98 సార్లు ఓడిన 78ఏళ్ల యూపీ వ్యక్తి.. మరోసారి ఎన్నికల బరిలోకి..!

Hasnuram Ambedkari : హస్నూరామ్ అంబేద్కరీ 1985లో ఇండిపెండెంట్‌గా మొదటి ఎన్నికల్లో పోటీ చేశారు. 100వ సారి పోటీ చేయడమే లక్ష్యం.. ఆ తర్వాత ఎన్నికల్లో పోటీ చేయను..

Hasnuram Ambedkari : 100 సార్లు పోటీ చేయడమే నా లక్ష్యం.. 98 సార్లు ఓడిన 78ఏళ్ల యూపీ వ్యక్తి.. మరోసారి ఎన్నికల బరిలోకి..!

My Aim Is To : UP Man Hasnuram Ambedkari, Who Has Lost 98 Times

Hasnuram Ambedkari : అతడికి ఓటమి ఏం కొత్తకాదు.. ఎన్నిసార్లు ఓటమి వెక్కిరించినా కొంచెం కూడా వెనుకంజ వేయలేదు. గెలుపే లక్ష్యంగా ప్రతిసారి ఎన్నికల్లో పోటీచేస్తూనే వస్తున్నాడు. అప్పటినుంచి ఒకటి కాదు.. రెండు కాదు.. మొత్తం 98సార్లు ఎన్నికల్లో పోటీ చేసి పరాజయం పాలయ్యాడు. అయినప్పటికీ పట్టువీడని విక్రమార్కుడిలా ఇప్పుడు లోక్ సభ ఎన్నికల్లో కూడా బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నాడు. అతడు ఎవరో కాదు.. ఆగ్రా జిల్లాలోని ఖేరాగఢ్ తహసీల్‌కు చెందిన 78 ఏళ్ల హస్నూరామ్ అంబేద్కరీ ‘ధర్తి పకడ్’.. ఎంఎన్‌ఆర్‌ఇజిఎ కింద జీవనోపాధి పొందే కార్మికుడిగా తాను మొదటిసారిగా 1985లో రాష్ట్ర ఎన్నికలలో పోటీ చేశాడు.

Read Also : ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్‌పై దాడి.. కనుబొమ్మపై గాయం

98సార్లు ఓడాను.. 100వ సారి పోటీ చేసి వదిలేస్తా : 
అయితే, 98 ఎన్నికల పరాజయాల తర్వాత వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కూడా పోటీచేసేందుకు ఆసక్తిగా ఉన్నాడు. ఈ సందర్భంగా అంబేద్కరీ మీడియాతో మాట్లాడుతూ.. “ఈసారి కూడా నేను రెండు స్థానాల్లో ఓడిపోతానేమో. కానీ, 100వ సారి పోటీ చేయడమే నా లక్ష్యం. ఆ తర్వాత ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయను” అని చెప్పారు. 1985 మార్చిలో ఆగ్రా జిల్లాలోని ఖేరాఘర్ నియోజకవర్గం నుంచి బహుజన్ సమాజ్‌వాది పార్టీ (BSP) అభ్యర్థిపై స్వతంత్ర అభ్యర్థిగా తన మొదటి ఎన్నికల్లో పోటీ చేశాడు. ఇప్పుడు, మళ్లీ తన చేతిలో నామినేషన్ పత్రాలతో ఆగ్రా రిజర్వ్డ్ సీటు ఫతేపూర్ సిక్రీ స్థానానికి దాఖలు చేస్తానని చెబుతున్నాడు.

టికెట్ ఇచ్చి వద్దంటూ అవమానించారని :
“నేను 1985 నుంచి గ్రామ ప్రధాన్, రాష్ట్ర అసెంబ్లీ, గ్రామ పంచాయితీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, లోక్‌సభ ఎన్నికలలో పోరాడాను. భారత రాష్ట్రపతి పదవికి కూడా నా అభ్యర్థిత్వాన్ని దాఖలు చేశారు. కానీ అది తిరస్కరించారు’ అని చెప్పారు. వరుస ఎన్నికలలో పోటీ చేయడానికి గల కారణాన్ని కూడా అంబేద్కరీ చెప్పారు. 1984 ఏడాది చివరిలో ఆగ్రా తహసీల్‌లో ‘అమీన్’ పదవిని వదిలిపెట్టాను. ఎందుకంటే.. ఖేరాఘర్ సీటుకు బీఎస్పీ నుంచి టికెట్ ఇస్తామని హామీ ఇచ్చారు.

కానీ, తర్వాత ఆ ప్రాంతంలోని పార్టీ కన్వీనర్ తనకు టిక్కెట్ ఇచ్చేందుకు నిరాకరించారు. అదే సమయంలో తనను ‘తుమ్హే తుమ్హారీ బీవీ ఓటు నహీ దేగీ, తో కోయి లేదా క్యా తుమ్హే ఓటు దేగా’ (మీ భార్య కూడా మీకు ఓటు వేయదు.. ఇంకా ఇతరులు ఎవరు ఓటు వేస్తారు) అంటూ అవమానించారు. అందుకు ప్రతీకారం తీర్చుకునేందుకే అంబేద్కరీ ఇండిపెంటెంట్‌గా పోటీ చేసి ఎన్నికల ఫలితాల్లో మూడో స్థానంలో నిలిచానని చెప్పుకొచ్చారు.

ఆ రెండు స్థానాలకు నామినేషన్ దాఖలు చేస్తా :
‘ప్రజల నుంచి భారీగా ఓట్లు రాబట్టగలనని నిరూపించుకునేందుకే అన్ని ఎన్నికల్లో పోటీ చేయాలని ప్లాన్ చేశాను. అంబేద్కరీ తాను దళిత ఐకాన్ డాక్టర్ భీమ్‌రావ్ అంబేద్కర్ అనుచరుడిని, 1977 నుంచి 1985 వరకు బ్యాక్‌వర్డ్ అండ్ మైనారిటీ కమ్యూనిటీస్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ (BAMCEF)తో అనుబంధం ఉంది’ అని పేర్కొన్నారు. వచ్చే సోమవారం తాను లోక్‌సభ ఎన్నికల్లో రెండు స్థానాలకు నామినేషన్లు దాఖలు చేస్తానని, నామినేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత ప్రజల వద్దకు వచ్చి ఓట్లు వేస్తానని అంబేద్కరీ తెలిపారు.

కుటుంబ సభ్యుల మద్దతుతో ఎన్నికల్లో పోటీ :
తన భార్య శివా దేవి (70), కుమారులు కూడా తాను ఎన్నికల్లో పోటీ చేయాలనే కలకి మద్దతు ఇస్తున్నారని, ఎన్నికలకు నామినేషన్లు దాఖలు చేయడానికి ఆర్థికంగా మద్దతు ఇస్తున్నారని ఆయన చెప్పారు. ‘నేను వ్యక్తిగతంగా వెళ్లి నా మద్దతుదారులను కలుసుకుని ఎన్నికల్లో నాకు ఓటు వేయమని అభ్యర్థిస్తున్నాను. నేను నేరుగా సంప్రదించలేని వారికి చేతితో రాసిన పోస్ట్‌కార్డ్‌లను కూడా పంపుతాను’ అని తెలిపారు. తనకు ఐదుగురు కుమారులు ఉన్నారని, అందరూ కూలీ పనులు చేసి పెళ్లి చేసుకున్నారు. నా కోడలు, మనవళ్లు, కుమార్తెలు అందరూ నాకు ప్రచారంలో మద్దతు ఇస్తామని చెప్పారు. లోక్‌సభ ఎన్నికల మూడో దశ నామినేషన్ల దాఖలు ఏప్రిల్ 12న ప్రారంభమై ఏప్రిల్ 19 వరకు కొనసాగనుంది.

Read Also : Perni Nani : సీఎం జగన్‌కు బలమైన గాయమైంది, పక్కా ప్రణాళిక ప్రకారమే దాడి- వైసీపీ నేతలు