33శాతం సీట్లు మహిళలకే.. ముఖ్యమంత్రి సంచలన నిర్ణయం

బిజూ జనతా దళ్(బీజేడీ) అధినేత, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాబోయే లోక్ సభ ఎన్నికల్లో తమ పార్టీ తరపున పోటీ చేసేవారిలో 33 శాతం సీట్లు మహిళలకే ఇస్తామని వెల్లడించారు. కేంద్రాపఢాలో నిర్వహించిన మహిళా స్వయం సహాయ బృంద (ఎస్‌హెచ్‌జీ) సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. లెజెండరీ బీజూ బాబు (ఒడిశా మాజీ ముఖ్యమంత్రి బీజూ పట్నాయక్) కర్మ భూమి అయిన కేంద్రాపఢా నుంచి నేను ఓ విషయంపై ప్రకటన చేస్తున్నాను. రాబోయే లోక్ సభ ఎన్నికల్లో ఒడిశా నుంచి పార్లమెంటుకి 33 శాతం మంది మహిళలు వెళ్లనున్నారని స్పష్టం చేశారు.
భారత్‌లో మహిళలు సాధికారత సాధించే దిశగా ఒడిశాలోని మహిళలు నాయకత్వం వహిస్తారంటూ ఆయన తెలిపారు. ప్రపంచానికి భారత్ నాయకత్వం వహించాలన్నా, అమెరికా, చైనా దేశాల్లా అత్యాధునిక దేశం కావాలన్నా మహిళా సాధికారతే మార్గమని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై ఆయన విమర్శలు గుప్పించారు. మహిళా సాధికారత అంటూ వ్యాఖ్యాలు చేస్తున్న జాతీయ పార్టీలు తమ మాటపై నిలబడాలని, ఆ దిశగా అడుగులు వేయాలని కోరారు. మహిళా సాధికారత కోసం కేంద్రంలోని ప్రభుత్వాలు కృషి చేయాలని ఆయన డిమాండ్ చేశారు.