ఎన్డీయే నాయకుడిగా నరేంద్ర మోదీ ఏకగ్రీవ ఎన్నిక.. ప్రధాని పక్కనే చంద్రబాబు..
దేశ వారసత్వాన్ని పరిరక్షించడం ద్వారా దేశం సర్వతోముఖాభివృద్ధి కోసం, దేశ ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి ఎన్డీయే ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందన్నారు.

NDA Leader Modi : ఎన్డీయే నాయకుడిగా నరేంద్ర మోదీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ మేరకు ఎన్డీఏ పక్షాల నేతలు తీర్మానం చేశారు. ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ నివాసంలో ఎన్డీయే పక్షాల సమావేశం జరిగింది. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్, జేడీయూ అధినేత నితీశ్ కుమార్ తో పాటు పలువురు ఎన్డీయే పక్షాల నేతలు హాజరయ్యారు. గంటన్నర పాటు ఈ సమావేశం సాగింది. కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటుకు భాగస్వామ్య పక్షాలు మద్దతు తెలిపాయి. ఇక కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నామని రాష్ట్రపతికి ఎన్డీయే పక్షాలు తెలుపనున్నాయి.
నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్డీయే.. ప్రభుత్వ ప్రజా సంక్షేమ విధానాలతో గత పదేళ్లలో భారత దేశంలోని 140కోట్ల మంది ప్రజలు, దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడాన్ని చూశారని ఎన్డీయే పక్షాల నేతలు అన్నారు. సుదీర్ఘ విరామం తర్వాత, దాదాపు 6 దశాబ్దాల అనంతరం దేశ ప్రజలు వరుసగా మూడోసారి సంపూర్ణ మెజారిటీతో బలమైన నాయకత్వాన్ని ఎన్నుకున్నారని చెప్పారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో నరేంద్ర మోదీ నాయకత్వంలో NDA ఐక్యంగా పోరాడి గెలిచినందుకు గర్విస్తున్నామన్నారు.
మోదీ నాయకత్వంలోని NDA ప్రభుత్వం.. పేదలు, మహిళలు, యువత, రైతులు, దోపిడీకి గురవుతున్న, అణగారిన పౌరులకు సేవ చేయడానికి కట్టుబడి ఉందని తెలిపారు. దేశ వారసత్వాన్ని పరిరక్షించడం ద్వారా దేశం సర్వతోముఖాభివృద్ధి కోసం, దేశ ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి ఎన్డీయే ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందన్నారు.
ప్రధాని నివాసంలో జరిగిన సమావేశానికి ఎన్డీయే భాగస్వామ్య పక్ష నేతలంతా అటెండ్ అయ్యారు. ఈసారి మూడో టర్మ్ కేంద్ర ప్రభుత్వంలో చంద్రబాబు కీ రోల్ పోషించబోతున్నారు. ప్రధాని పక్కనే చంద్రబాబు కూర్చోవడం ఇందుకు నిదర్శనంగా చెబుతున్నారు. ఎన్డీయే కూటమిలో బీజేపీ తర్వాత అత్యధిక లోక్ సభ స్థానాలు (16) గెలుచుకున్న పార్టీగా టీడీపీ ఉంది. చంద్రబాబు తర్వాత నితీశ్ కుమార్ (12 స్థానాలు) ఉన్నారు. సంఖ్యా బలం ఆధారంగా సీటింగ్ ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తోంది.
ప్రధాని నివాసంలో సుమారు గంటన్నర పాటు ఎన్డీయే పక్ష నేతల సమావేశం జరిగింది. మేమంతా ఐక్యంగా ఉన్నాం అనే సందేశాన్ని ఇవ్వడం జరిగింది. అలాగే ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నట్లు ఎన్డీయే భాగస్వామ్య పక్షాలు స్పష్టం చేశాయి. ఇప్పటికే పలు పార్టీలు తమ మద్దతును బీజేపీకి తెలిపాయి. రాష్ట్రపతిని ఎప్పుడు కలుస్తారు అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. 7వ తేదీన ఎన్డీయే పార్లమెంటరీ పార్టీ సమావేశం ఓల్డ్ పార్లమెంట్ లోని సెంట్రల్ హాల్ లో జరగబోతోంది. ఆరోజు ఎంపీలంతా హాజరవుతారు. ఎన్డీయే పార్లమెంటరీ పార్టీ నేతగా, తమ ప్రధాని అభ్యర్థిగా మోదీని అధికారికంగా ఎంపిక చేసి రాష్ట్రపతికి ఎన్డీయే పక్ష నేతలు సమాచారం ఇస్తారని తెలుస్తోంది.
Also Read : ఎన్డీయేలో కీలకంగా మారిన చంద్రబాబు..! ఈసారైనా ఏపీ దశ మారబోతోందా?