మోడీని ఎదిరించి మాట్లాడే నాయకత్వం దేశానికి అవసరం..బీజేపీ లీడర్ జోషి

ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఎదురుగా నిలబడి భయపడకుండా ధైర్యంగా మాట్లాడేవాళ్లు,వాదించగలిగే సత్తా ఉన్న నాయకత్వం భారతదేశానికి అవసరమని బీజేపీ సీనియర్ లీడర్ మురళీ మనోహర్ జోషి అన్నారు. జాతీయ, అంతర్జాతీయ ప్రాముఖ్యత ఉన్న అంశాలపై అన్ని పార్టీ శ్రేణుల మధ్య చర్చల అభ్యాసం దాదాపుగా పూర్తయిందని, తప్పనిసరిగా ఇది పునరుద్ధరించబడాలని ఆయన అన్నారు. అనరోగ్యంతో జూలైలో మరణించిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జైపాల్ రెడ్డికి నివాళులర్పించే కార్యక్రమంలో పాల్గొన్న జోషి ఈ వ్యాఖ్యలు చేశారు.
ప్రస్తుతం ఒక అభిప్రాయాన్ని స్పష్టంగా వ్యక్తీకరించే నాయకత్వం అవసరం ఉందని, ఎటువంటి సంకోచం లేకుండా సిద్దాంతాల ఆధారంగా ప్రధానమంత్రితో డిబేట్ చేయగలిగే నాయకత్వం అవసరం ఎంతైనా ఉందన్నారు. ఆ వ్యాఖ్యలు ప్రధానిని సంతోష పరుస్తయా లేక బాధపరుస్తాయా అన్నది చూడకూడదని అన్నారు. మోడీ,షా నాయకత్వంపై గతంలో పలుసార్లు జోషి విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరోసారి ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వెనుక ఉద్దేశం పార్టీ అధినాయకత్వాన్ని ఎవ్వరూ ఎదిరించి మాట్లాడలేకపోతున్నారని ఆయన మనసులో ఆవేదన ఉండి ఉండవచ్చని అర్థమవుతోంది. ఈ ఏడాది ఏప్రిల్ లో జరిగిన లోక్ సబ ఎన్నికల్లో తనకు టిక్కెట్ కేటాయించకపోవడంపై పార్టీ అధినాయకత్వంపై జోషి విమర్శలు చేసిన విషయం తెలిసిందే. బీజేపీలో మోడీ-అమిత్ షా కాలం ప్రారంభమైన 2014నుంచి అద్వాణీ,జోషి లాంటి సీనియర్ నాయకులు బలవంతంగా రిటైర్మెంట్ తీసుకోవాల్సి వచ్చింది.
జోషి వ్యాఖ్యలపై కాంగ్రెస్ నాయకుడు, ఎంపీ మనీష్ తివారీ స్పందించారు. రియల్ ఇష్యూస్ పై మోడీని భయం లేకుండా జోషి ప్రశ్నించాలని మనీష్ కోరారు. బీజేపీ అధ్యక్షుడిగా జోషి పనిచేశారని,భయం లేకుండా ఆయన వాస్తవిక అంశాలపై మోడీని ప్రశ్నించాలని ఆశిస్తున్నట్లు మనీష్ తెలిపారు.