ఎవరెస్ట్ ఎత్తు పెరిగింది

  • Published By: venkaiahnaidu ,Published On : December 8, 2020 / 04:58 PM IST
ఎవరెస్ట్ ఎత్తు పెరిగింది

Mount-Everest

Updated On : December 9, 2020 / 8:50 AM IST

Nepal announces newly-measured height of Mount Everest ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శిఖరం “ఎవరెస్ట్”‌ ఎత్తును మంగళవారం(డిసెంబర్-8,2020) నేపాల్ ప్రభుత్వం ప్రకటించింది. ఎవరెస్ట్‌ ఎత్తు 0.86 మీటర్లు పెరిగిందని తెలిపింది. ఎవరెస్ట్ ఎత్తుపై కొన్నేళ్లుగా తర్జనభర్జనలు సాగుతున్న విషయం తెలిసిందే. దశాబ్దాల తరబడి హిమాలయ పర్వత పీఠభూముల్లో చోటు చేసుకుంటోన్న మార్పుల వల్ల, ముఖ్యంగా 2015లో హిమాలయన్ కంట్రీ నేపాల్‌ ను నిలువెల్లా వణికించిన భారీ భూకంపం అనంతరం ఎవరెస్ట్ శిఖరం ఎత్తుపై ప్రపంచవ్యాప్తంగా అనుమానాలు వ్యక్తం అయ్యాయి. భూకంపం అనంతరం ఎవరెస్ట్ శిఖరం ఎత్తు తగ్గి ఉండొచ్చనే సందేహాలు తలెత్తాయి.



అయితే, ఈ సందేహాలన్నింటిని పటాపంచలు చేసింది నేపాల్. 2015 భూకంపం తర్వాత ఎవరెస్ట్ ఎత్తు మారి ఉంటుందన్న సందేహాల నేపథ్యంలో నేపాల్‌ ప్రభుత్వం..ప్రపంచంలోనే అత్యతం ఎత్తైన ఎవరెస్ట్ శిఖరం ఎత్తును కొలిచే ప్రక్రియను చైనా సహకారంతో 2019లో ప్రారంభించింది. మంగళవారం శిఖరం ఎత్తుకి సంబంధించిన లెక్కలను బయటపెట్టి ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న సందేహాలన్నింటిని నేపాల్ పటాపంచలు చేసింది. ఎవరెస్ట్ ఎత్తు ఏ మాత్రం తగ్గలేదని,ఇంకా 0.86 మీటర్లు పెరిగిందని నేపాల్ ప్రభుత్వం ప్రకటించింది.



తాజా లెక్కల ప్రకారం… ఎవరెస్ట్ శిఖరం ఎత్తు 8,848.86 మీటర్లు అని నేపాల్ విదేశాంగశాఖ మంత్రి ప్రదీప్ కుమార్ గ్యవాలి మంగళవారం ప్రకటించారు. నేపాల్ విదేశాంగ మంత్రి ప్రదీప్ కుమార్, చైనా మంత్రి వాంగ్ యి వర్చువల్ కార్యక్రమంలో ఈ వివరాలను ప్రకటించారు. ఇదివరకు ఉన్న ఎత్తు 8848 మీటర్లు. కాగా, తాజా లెక్కల ప్రకారం.. దీని ఎత్తు 0.86 పెరిగిందని తెలిపారు. వేర్వేరు కోణాల్లో సర్వే ను చేపట్టిన తరువాతే కొత్త ఎత్తును ఖరారు చేసినట్లు ప్రదీప్ కుమార్ గ్యావలి స్పష్టం చేశారు. ఏడాదికాలం పాటు అత్యాధునిక పద్ధతుల్లో, ఈ అత్యున్నత శిఖరం ఎత్తుపై సర్వే చేపట్టినట్లు తెలిపారు.



మరోవైపు, 1954లో భారత ప్రభుత్వం ఈ పర్వతం ఎత్తును కొలిచినపుడు 8,848 మీటర్లు అని నిర్థరణ అయింది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు దీనినే విస్తృతంగా ఆమోదిస్తున్నారు. అయితే దీని ఎత్తు 8848.86కు పెరిగినట్లు తాజాగా తేలింది.