Delhi Railway Station: ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో విషాదం.. కుంభమేళా యాత్రికుల రద్దీతో తొక్కిసలాట.. 18మంది మృతి..
న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ లో విషాద ఘటన చోటు చేసుకుంది. కుంభమేళాకు వెళ్లే ప్రయాణికులతో రైల్వే స్టేషన్ ప్రాంతం పోటెత్తింది. ఈ క్రమంలో తొక్కిసలాట చోటు చేసుకుంది..

New Delhi Railway Station Stampede
Delhi Railway Station Stampede: న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ లో విషాద ఘటన చోటు చేసుకుంది. కుంభమేళాకు వెళ్లే ప్రయాణికులతో రైల్వే స్టేషన్ ప్రాంతం పోటెత్తింది. ఈ క్రమంలో 14వ నవంబర్ ప్లాట్ ఫాం వద్ద తొక్కిసలాట ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో 10మంది మహిళలు, నలుగురు చిన్నారులు సహా 18మంది మృతిచెందారు. శనివారం రాత్రి 10గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. తొక్కిసలాట ఘటనలో 30మందికిపైగా ప్రయాణికులు గాయపడ్డారు. కొందరు మహిళలు ఊపిరాడక స్పృహతప్పి పడిపోయారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం హుటాహుటీన లోక్‌నాయక్ జైప్రకాశ్ నారాయణ్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
తొక్కిసలాట ఘటనకు కారణం ఏమిటంటే?
శనివారం రాత్రి 9గంటల సమయంలో ఢిల్లీ రైల్వే స్టేషన్ లోని 14 నవంబరు ప్లాట్ ఫాంలపై తొక్కిసలాట ఘటన చోటు చేసుకుంది. కుంభమేళాకు వెళ్లాల్సిన స్వతంత్ర సేనాని ఎక్స్‌ప్రెస్, భువనేశ్వర్ రాజధాని రైళ్లు ఆలస్యమయ్యాయి. పెద్దెత్తున కుంభమేళాకువెళ్లే ప్రయాణికులు రైల్వే స్టేషన్ లోని ప్లాట్ ఫాంలపైకి చేరుకున్నారు. దీంతో రైల్వే స్టేషన్ ప్రాంతం ప్రయాణీకులతో కిక్కిరిసిపోయింది. ఈ క్రమంలో ప్రయాగ్ రాజ్ కు మరో ప్రత్యేక రైలు ఏర్పాటు చేసినట్లు రైల్వేశాఖ ప్రకటించింది. ఆ రైలును అందుకునే క్రమంలో ప్రయాణీకులు ఒక్కసారిగా 14వ నంబర్ ప్లాట్ ఫాంపైకి రావటం వల్ల తొక్కిసలాట జరిగింది. కమర్షియల్ మేనేజ్ మెంట్ ఇన్ స్పెక్టర్ (సీఎంఐ) తెలిపిన వివరాల ప్రకారం.. రైల్వేస్ ప్రతిగంటకు 1500 టికెట్లు విక్రయించింది. ఊహించనంతగా ప్రయాణికులు వచ్చారని తెలిపింది.
ఘటనాస్థలిలో ప్రయాణికుల బ్యాగులు, దుస్తులు, చెప్పులు చెల్లాచెదురుగా పడ్డాయి. సుమారు 15 నుంచి 20 నిమిషాల పాటు రైల్వే స్టేషన్ లో తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. తొక్కిసలాట ఘటన సమయంలో భయంతో జనం తమ చిన్నారులను భుజాలపైకి ఎత్తుకుని, బ్యాగులు పట్టుకొని పరుగెడుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఘటన జరిగిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది హుటాహుటీన రంగంలోకిదిగి పరిస్థితిని అదుపులోకి తెచ్చినట్లు ఢిల్లీ ఫైర్ సర్వీసెస్ చీఫ్ అతుల్ గార్గ్ చెప్పారు.
న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో తొక్కిసలాట ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు ట్విటర్ ద్వారా స్పందించారు. ‘‘న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ లో జరిగిన తొక్కిసలాట నన్ను బాధించింది. తమ ప్రియమైన వారిని కోల్పోయిన వారి చుట్టే తన ఆలోచనలు ఉన్నాయి. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్ధిస్తున్నాను’’ అని ప్రధాని పేర్కొన్నారు.
Distressed by the stampede at New Delhi Railway Station. My thoughts are with all those who have lost their loved ones. I pray that the injured have a speedy recovery. The authorities are assisting all those who have been affected by this stampede.
— Narendra Modi (@narendramodi) February 15, 2025
ఘటనపై ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా, రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతిని తెలిపారు. ఘటనపై రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ట్విటర్ లో స్పందించారు. ఘటనా స్థలికి వెంటనే రైల్వే, ఢిల్లీ పోలీస్, సీఆర్పీఎఫ్ బలగాలు చేరుకున్నాయి. వారాంతం కావడంతో అధికంగా వచ్చిన భక్తుల రాకపోకల కోసం అదనపు రైళ్లను నడుపుతున్నాం. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని పేర్కొన్నారు.