ఇతర రాష్ట్రాలకు ఆక్సిజన్ పంపలేం..మోడీకి కేరళ సీఎం లేఖ
ఇకపై ఇతర రాష్ట్రాలకు ఆక్సిజన్‌ను సరఫరా చేయమని కేరళ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ కేంద్రానికి తేల్చి చెప్పారు.

Kerala
Kerala ఇకపై ఇతర రాష్ట్రాలకు ఆక్సిజన్‌ను సరఫరా చేయమని కేరళ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ కేంద్రానికి తేల్చి చెప్పారు. ఈ మేరకు ఆయన ప్రధాని మోడీకి సోమవారం లేఖ రాశారు. ఇప్పటికే తమ వద్ద వున్న బఫర్ స్టాక్(అత్యవసర ఆక్సిజన్ నిల్వలు) పొరుగు రాష్ట్రాలకు సరఫరా చేశామని, కేరళలో ఇప్పుడు కేవలం 86 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ మాత్రమే మిగిలిందని లేఖలో పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కోవిడ్ కేసులు పెరుగతున్న పరిస్థితుల దృష్ట్యా ఇతర రాష్ట్రాలకు ఆక్సిజన్‌ను సరఫరా చేయడం ఆచరణలో సాధ్యం కాని విషయం అని పినరయ్ స్పష్టం చేశారు.
ప్రస్తుతం కేరళలో 4,02,640 యాక్టివ్ కరోనా కేసులు ఉన్నట్లు తెలిపారు. మే 15 నాటికి ఈ సంఖ్య ఆరు లక్షలకు చేరే ప్రమాదం ఉందన్నారు. ఈ నేపథ్యంలో మే 15 నాటికి తమకు 450 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ అవసరమయ్యే అవకాశం ఉందని తెలిపారు. అయితే,ముందుగా నిర్ణయించిన ప్రకారం తమిళనాడుకు 40 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్‌ను సరఫరా చేస్తామన్నారు. ఆ తర్వాత ఇతర రాష్ట్రాలకు ఆక్సిజన్ ఇవ్వడం ఆచరణ సాధ్యం కాదని తెలిపారు.
రాష్ట్రంలో ఆక్సిజన్ ఉత్పత్తి చేస్తున్న ప్లాంట్లలో ఐనాక్స్ ప్రధానమైందని సీఎం తెలిపారు. దీని తయారీ సామర్థ్యం 150 మెట్రిక్ టన్నులని పేర్కొన్నారు. మొత్తం ఇతర చిన్న ప్లాంట్లతో కలిపి రాష్ట్రంలో రోజుకి 219 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ అందుబాటులో ఉంటుందని వివరించారు. ఇక ప్రధాన స్టీల్ ప్లాంట్లన్నీ కేరళకు భౌగోళికంగా దూరంగా ఉన్న నేపథ్యంలో కేరళలో ఉత్పత్తవుతున్న మొత్తం ఆక్సిజన్ తమ రాష్ట్రానికే కేటాయించాలని కోరారు. మరోవైపు, కొవిడ్ ఉద్ధృతి నేపథ్యంలో ప్రస్తుతం కేరళలో లాక్‌డౌన్ కొనసాగుతోంది.