రాకెట్లు కాదు : శానిటైజర్లు, ఆక్సిజన్ కెనిస్టర్లు తయారు చేస్తున్న ISRO

ఇస్రో..అనగానే ఏమి గుర్తుకు వస్తుంది. ఇదేం సమాధానం ? రాకెట్ల తయారీ, అంతరిక్ష ప్రయోగాలు గుర్తుకు వస్తాయి..అంటారు కదా. కానీ..ఎన్నో రికార్డులు సొంతం చేసుకున్న ఇస్రో ప్రస్తుతం శానిటైజర్లు, ఆక్సిజన్ కెనిస్టర్లు తయారీలో నిమగ్నమైంది. కరోనా వైరస్ పై ప్రభుత్వం చేస్తున్న యుద్ధానికి మద్దతుగా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో రంగంలోకి దిగింది.
కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుండడం..మృతుల సంఖ్య ఎక్కువగా ఉంటుండడంతో సహాయం చేసేందుకు వ్యాపార దిగ్గజ సంస్థలు, ఇతర ప్రముఖులు ముందుకు వస్తున్నారు. వెంటిలేటర్లు, ఆక్సిజన్ కెనిస్టర్లు, మాస్కుల తయారీకి ఇస్రో నడుం బిగించింది. దేశంలో అత్యవసరమైన తయారీకి తోడ్పాటు అందించనున్నట్లు సంస్థ డైరెక్టర్ ఎస్. సోమ్ నాథ్ వెల్లడించారు. వెంటిలెటర్ ను కేవలం విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ డిజైన్ చేస్తుందని తెలిపారు.
ప్రస్తుతానికి రాకెట్ల తయారీని ఆపివేసినట్లు ప్రకటించారు. ప్రస్తుతం దాదాపు వేయి లీటర్ల శానిటైజర్ లను తయారు చేశామని, తమ ఉద్యోగులు మాస్క్ లను తయారు చేస్తున్నామని సోమ్ నాథ్ తెలిపారు.
కమ్యూనికేషన్ కంప్యూటర్లు అత్యంత సురక్షితమైనవని, అవసరమైతే ఉద్యోగులు ఇంటి వద్దనుంచే పనిచేస్తారన్నారు. ప్రస్తుతం విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్‌లో ఎవ్వరు కరోనా బారిన పడలేదని ఆయన స్పష్టం చేశారు.
Also Read | భద్రాద్రి రాముల వారి కళ్యాణానికి అంకురార్పణ