Rahul Gandhi : బ్లాక్ ఫంగస్ పై కేంద్రానికి రాహుల్ మూడు ప్రశ్నలు
దేశంలో బ్లాక్ ఫంగస్ కేసులు క్రమంగా పెరుగుతుండటంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు.

On Black Fungus Cases In India Rahul Gandhi Shoots Three Questions At Govt
Rahul Gandhi దేశంలో బ్లాక్ ఫంగస్ కేసులు క్రమంగా పెరుగుతుండటంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. బ్లాక్ ఫంగస్ చికిత్సకు కేంద్రం అనుసరిస్తున్న విధానాలను తప్పుబట్టారు. సరైన చికిత్సా విధానం లేక బ్లాక్ ఫంగస్ బాధితులు సతమతమవుతున్నారని తెలిపారు. బ్లాక్ ఫంగస్ పేషెంట్లకు వాడే డ్రగ్స్ కొరతను పరిష్కరించేందుకు కేంద్రప్రభుత్వం ఏం చేస్తుందని రాహుల్ ప్రశ్నించారు. ఈ మేరకు మంగళవారం ట్విట్టర్ వేదికగా కేంద్రానికి మూడు ప్రశ్నలు సంధించారు రాహుల్ గాంధీ. వీటికి సమాధానాలు చెప్పాలని డిమాండ్ చేశారు.
బ్లాక్ ఫంగస్ వ్యాధి గురించిన కేంద్రప్రభుత్వం ప్రజలకు కచ్చితమైన సమాచారం ఇవ్వాలి. 1. బ్లాక్ ఫంగస్ ఔషధం ఆమ్ ఫోటెరిసిన్-B కొరతపై ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు? 2. పేషెంట్ ఈ మెడిసిన్ పొందాల్సిన పద్ధతులు ఏంటి?. 3) బ్లాక్ ఫంగస్ వ్యాధికి చికిత్స ఇవ్వకుండా నిబంధనల పేరుతో ప్రభుత్వం ప్రజలను ఎందుకు అయోమయంలోకి నెట్టేస్తుంది?అని రాహుల్ తన ట్వీట్ లో పేర్కొన్నారు.
మరోవైపు,అమెరికా నుంచి భారత్ కు ఆదివారం ఉదయం 2 లక్షల బ్లాక్ ఫంగస్ డ్రగ్స్(ఆమ్ఫోటెరిసిన్-B) చేరినట్లు అమెరికాలోని భారత రాయబారి తరణ్జిత్ సింగ్ సంధూ తెలిపారు. అమెరికన్ బయోఫార్మాస్యూటికల్ కంపెనీ గిలీడ్ సైన్సెస్ నుంచి తాజా డ్రగ్స్ వచ్చినట్లు సింగ్ తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని ఆమ్ఫోటెరిసిన్-B డ్రగ్స్ అమెరికా నుంచి భారత్ కు వచ్చే అవకాశం ఉందని తెలిపారు.