మేడ ఎక్కేసిన ఎద్దు..పచ్చగడ్డి ఎర వేసిన పోలీసులు

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బరేలీ జిల్లాలోని లఖీంపూర్ ఖేరీస్ పాలియా పట్టణంలో ఓ ఎద్దు షాపింగ్ కాంప్లెక్స్ భవనంపైకి ఎక్కేసింది. పాపం ఎలా దిగాలో తెలీలేదు. పైనే ఉండి కిందికి ఎలా దిగాలో తెలీక అంత పెద్ద ఎద్దూ కూడా బిత్తర చూపులు చూసింది.
బుధవారం (డిసెంబర్ 18) ఎందుకు ఎక్కిందో గానీ ఓ షాపింగ్ కాంప్లెక్స్ బిల్డింగ్ ఎక్కేసింది. అలా ఎక్కేసిన ఎద్దు రాత్రంతా అలాగే పైనే ఉండిపోయింది. గురువారం ఉదయం భవనం పైన అంచున నిలబడి కిందికి చూస్తున్న ఎద్దును కొంతమంది జనాలు చూశారు. అలా ఏంటీ వీళ్లు పైకి చూస్తున్నారు అంటూ ఇంకొందరు పైకి చూసి వారు కూడా అలాగే చూస్తుండటంతో అలా అలా అక్కడ జనం పెద్దసంఖ్యలో గుమిగూడారు. ఎద్దును తమ ఫోన్లతో వీడియోలు, ఫోటోలు తీయడం మొదలెట్టారు.
ఇంతో ఎవరో భవనంపైకి ఎక్కిన ఎద్దు గురించి పోలీసులకు సమాచారం అందించటంతో బసవణ్ణి (ఎద్దుని) కిందకు దించటానికి ఎస్ఐ డీకే సింగ్ తోపాటు పోలీసుల బృందం హుటాహుటిన తరలివచ్చాయి. నానా రకాలుగా ఎద్దుకు కిందికి దించటానికి గంటల తరపడి నానా పాట్లు పడ్డారు. ఆఖరికి ఓ పోలీస్ కు ఓ ఐడియా వచ్చింది. దీంతో ఓ తాడుకు పచ్చగడ్డి కట్టి ఎద్దుకు ఎరగా వేసి..దాన్ని చూపిస్తూ మెట్లమ్మట జాగ్రత్తగా కిందకు దించారు. పోలీసులు శ్రమ ఫలించింది. ఎద్దు సురక్షితంగా దిగి వచ్చింది. దీంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ఎవరి పనులపైవాళ్లు వెళ్లిపోయారు.