Pahalgam Terror Attack: పహల్గాం ఉగ్రదాడి ఎఫెక్ట్.. భారత్ లో పాకిస్థాన్ ‘ఎక్స్’ ఖాతా నిలిపివేత
పాకిస్థాన్ ప్రభుత్వానికి చెందిన అధికారిక ‘ఎక్స్’ఖాతా ను భారత్ లో నిలిపివేసింది. ఈ మేరకు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ ..

Pahalgam Attack
Pahalgam Terror Attack: పహల్గాంలో పర్యటకులను ఉగ్రవాదులు కాల్చి చంపేశారు. ఈ దారుణ ఘటనలో దాదాపు 28మంది మరణించారు. ఈ ఉగ్రదాడితో భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. పర్యటకులపై ఉగ్రదాడి వెనుక పాకిస్థాన్ హస్తం ఉందని భారత్ భావిస్తోంది. దీంతో భారత ప్రభుత్వం పాకిస్థాన్ లక్ష్యంగా కీలక నిర్ణయాలు తీసుకుంటుంది.
ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర భద్రతా వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (సీసీఎస్) సమావేశం బుధవారం జరిగింది. ఈ సమావేశంలో పాక్ సీమాంతర ఉగ్రవాదాన్ని వీడేవరకూ ఆ దేశంపై కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించారు. ఈ క్రమంలోనే సింధూ నదీ జలాల ఒప్పందం అమలును నిలిపివేస్తున్నట్లు ప్రకటించడంతోపాటు.. ఇరు దేశాల మధ్య ఉన్న అటారీ సరిహద్దును మూసివేస్తూ భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మరోవైపు భారతదేశంలోని పాకిస్థాన్ దౌత్య కార్యాలయాల్లో పనిచేస్తోన్న పాకిస్థాన్ సైనిక సిబ్బంది, అధికారులను అవాంఛిత వ్యక్తులుగా ప్రకటిస్తూ వారం రోజుల్లోగా దేశం విడిచివెళ్లాలని భారత ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. తాజాగా.. మరో కీలక నిర్ణయం తీసుకుంది.
పాకిస్థాన్ ప్రభుత్వానికి చెందిన అధికారిక ‘ఎక్స్’ఖాతా ను భారత్ లో నిలిపివేసింది. ఈ మేరకు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ సోషల్ మీడియా సంస్థ ‘ఎక్స్’ ను అభ్యర్థించింది. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా భారతదేశంలో పాకిస్థాన్ అధికారిక ‘ఎక్స్’ సేవలను నిలిపివేయాలని సూచించారు. దీంతో పాక్ ప్రభుత్వ ఖాతాను భారత్ లో సస్పెండ్ చేసింది ఎక్స్. ఇకనుంచి ఆ ఖాతాలోని కంటెంట్ ను భారతదేశంలోని యూజర్లు చూడలేరు.
Government of Pakistan’s account on ‘X’ withheld in India pic.twitter.com/Lq4mc2G62g
— ANI (@ANI) April 24, 2025