యుద్ధ మేఘాలు…పాకిస్తాన్ క్షిపణి ప్రయోగం

  • Published By: chvmurthy ,Published On : August 28, 2019 / 04:24 PM IST
యుద్ధ మేఘాలు…పాకిస్తాన్ క్షిపణి ప్రయోగం

Updated On : August 28, 2019 / 4:24 PM IST

ఢిల్లీ : జమ్మూ కశ్మీర్ లో ఆర్టికల్ 370, ఆర్టికల్ 35-ఏ  లను కేంద్రంలోని మోడీ ప్రభుత్వం రద్దుచేసినప్పటి నుంచి భారత్ తో యుధ్దం వస్తే ఎంతకైనా తెగిస్తామని హెచ్చరికలు చేస్తున్న పాకిస్తాన్ త్వరలో క్షిపణి పరీక్షలు నిర్వహించనుంది. అందుకు తగ్గట్టుగానే పాకిస్థాన్ అధికారులు ఆగస్టు 29,2019 , బుధవారంనాడు ‘నోటమ్’ (నోటీస్ టు ఎయిర్‌మెన్), నావల్ వార్నింగ్ జారీ చేశారు. దీంతో క్షిపణి పరీక్షకు అవకాశాలున్నాయనే సంకేతాలు వెలువడుతున్నాయి.

కరాచీ సమీపంలోని సొన్మియాని పరీక్షా కేంద్రం నుంచి పాక్  ఈ క్షిపణి ప్రయోగం జరపవచ్చని తెలుస్తోంది. ఈనెల 28, 31 తేదీల్లో తెల్లవారుఝూమున గం.4.40 నిమిషాల నుంచి ఉదయం గం.09.00 లోపు  సైనిక విన్యాసాలు ఉంటాయని కూడా ఆ నోటీసులో పేర్కొన్నారు. కశ్మీర్‌పై నిర్ణయాత్మక యుద్ధానికి సమయం ఆసన్నమైందని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మంగళవారం, 2019 ఆగస్టు 27న చేసిన వ్యాఖ్యలను పాక్ రైల్వే మంత్రి షేక్ రషీద్ బుధవారం 2019 ఆగస్టు 28 నాడు రావల్పిండిలో జరిగిన  విలేకరుల సమావేశంలో పునరుద్ఘాటించారు. ఈ  పరిస్ధితుల్లో పాక్ అధికారులు ‘నోటమ్’ జారీ చేయడం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది.

2019 చివరిలోగా, బహుశా అక్టోబర్, నవంబర్‌లో పాక్, భారత్ మధ్య యుద్ధం జరగవచ్చని, ఇదే రెండు దేశాల మధ్య చివరి యుద్ధం కావచ్చని షేక్ రషీద్ ఆగస్టు 28న జరిగిన విలేకరుల సమావేశంలో వ్యాఖ్యానించారు. కశ్మీర్ ప్రజల గొంతు నొక్కడానికి  భారత  ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ప్రపంచ వ్యాప్తంగా పాకిస్తాన్ చేస్తున్న దుష్ప్రచారం విఫలమయ్యింది. కాశ్మీర్ విషయంలో అంతర్జాతీయంగా పాక్ ఒంటరిదైంది.

అమెరికా, రష్యా, యునైటెడ్ కింగ్‌డమ్, ఫ్రాన్స్ మరియు ఇస్లామిక్ రాష్ట్రాలతో సహా అన్ని ప్రధాన ప్రపంచ దేశాలు ఆర్టికల్ 370 రద్దు భారతదేశం యొక్క అంతర్గత సమస్య అంటూ మోడీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించాయి.