మోడీ విమానానికి దారి ఇవ్వం

భారత ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా వెళ్లేందుకు పాకిస్తాన్ ఎయిర్ స్పేస్ లోకి అనుమతించాలని పాక్ ను భారత్ అనుమతి అడిగిన విషయం తెలిసిందే. అయితే మోడీ ప్రయాణించే విమానం కోసం తమ గగనతల మార్గాన్ని ఇవ్వబోమని పాకిస్తాన్ స్పష్టం చేసింది. ఆ దేశ విదేశాంగ శాఖ మంత్రి షా మెహబూద్ ఖురేషీ ఈ విషయాన్ని తెలిపారు భారతీయ హై కమిషన్‌కు ఈ విషయాన్ని చేరవేసినట్లు ఆయన తెలిపారు.
అమెరికాలో జరగనున్న హౌడీ మోదీ సభ కోసం ప్రధాని మోదీ వెళ్లనున్నారు. అయితే పాక్ గగనతలం మీదుగా మోడీ విమానం వెళ్లవలసి ఉన్నది. ఇటీవల రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సమయంలో పాక్ తమ గగనతలంపై ఆంక్షలు విధించింది. తమ ఎయిర్ స్పేస్ గుండా భారత విమానాలు వెళ్లేందుకు అనుమతించడం లేదు.
సెప్టెంబర్ 21నుంచి 27వరకు మోడీ అమెరికా పర్యటన కొనసాగుతుంది. ఈ నెల 22న అమెరికాలోని హ్యూస్టన్ లో జరగనున్న “హౌడీ మోడీ”మెగా ఈవెంట్ లో భారత ప్రధాని నరేంద్రమోడీతో కలిసి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా పాల్గొనబోతున్నారు. ఓ అమెరికా అధ్యక్షుడు,ఓ భారత ప్రధాని కలిసి సంయుక్త ర్యాలీలో ప్రసంగించడం ఇదే మొదటిసారి.
హ్యూస్టన్‌లోని విశాలమైన ఎన్‌ఆర్‌జి స్టేడియంలో సెప్టెంబర్ 22న జరగనున్న “హౌడీ, మోడీ! షేర్డ్ డ్రీమ్స్, బ్రైట్ ఫ్యూచర్స్” కార్యక్రమానికి అమెరికా నలుమూలల నుండి 50,000 మంది భారతీయ-అమెరికన్లు రిజిస్టర్ చేసుకున్నారు. ఈ వేదికపైనే ఇరు దేశాల మధ్య గత కొంతకాలంగా నెలకొన్న వాణిజ్య విభేదాలకు కూడా తెరపడొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.