జాదవ్ కేసు : పాక్ కు చీవాట్లు పెట్టిన అంతర్జాతీయ న్యాయస్థానం

అంతర్జాతీయన్యాయస్థానం(ఐసీజే)లో పాక్ తన బుద్ధి చూపించింది. కుల్ భూషణ్ జాదవ్ కేసులో సోమవారం(ఫిబ్రవరి-18,2019) ఐసీజేలో వాదనలు జరుగుతున్న సమయంలో పాక్ తరపున తాత్కాలిక న్యాయమూర్తిగా ఉన్న తసాదఖ్ హుస్సేన్ జిలానీకి గుండెపోటు వచ్చి ఆయన ఆస్పత్రిలో ఉన్న కారణంగా ఆయన స్థానంలో వేరే న్యాయమూర్తిని నియమించయేంత వరకు విచారణ వాయిదా వేయాలని మంగళవారం(ఫిబ్రవరి-19,2019) పాక్ అటర్నీ జనరల్ అన్వార్ మన్సూర్ ఖాన్ ఐసీజేని కోరాడు. దీనికి ఐసీజే ఒప్పుకోలేదు. దీనిపై ఐసీజే ప్రెసిడెంట్ అబ్దుల్ ఖవి అహ్మద్ యూసఫ్ మన్సూర్ ఖాన్ ని ఉద్దేశించి మాట్లాడుతూ.. మీ స్టేట్ మెంట్ రెడీగా ఉంటే ఆ స్టేట్ మెంట్ చదవాలని నేను అడుగుతున్నాను. మీరు చెప్పేది, మీ తరపున చెప్పేది వినడానికి మేము సిద్ధంగా ఉన్నాము. దీంతో మన్సూర్ ఖాన్ కి చెంప చెల్లుమన్నట్లనిపించింది.
పాక్ తరపున ఐసీజేలో మన్సూర్ ఖాన్ వాదనలు వినిపించాడు. 2014 పెషావర్ లోని మిలటరీ స్కూల్ లో జరిగిన ఉగ్రదాడిలో భారత్ ప్రమేయం దంటూ మన్సూర్ తీవ్ర ఆరోపణలు చేశాడు. ఈ ఉగ్రదాడిలో తాము 140 మంది పిల్లలను కోల్పోయామని, ఈ దాడికి భారత్ స్పాన్సర్ చేసిందని, ఇప్పుడు కుల్ భూషణ్ జాదవ్ తో బలూచిస్థాన్ లో దాడులు చేయాలని భారత ప్రభుత్వం భావించిందని, జాదవ్ రా అధికారి అని అన్నాడు. విచారణలో జాదవ్ ఈ విషయాన్ని అంగీకరించాడని,ఆత్మాహుతి దాడులు జరిపి పాక్ లో గందరగోళం సృష్టించేందుకు జాదవ్ అనేక మందిని కలిశాడని, భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ నిర్దేశకత్వంలోనే జాదవ్ ఈ పనులన్నీ చేశాడని, జాదవ్ ను ఇరాన్ నుంచి కిడ్నాప్ చేశామని భారత్ చెప్పడం హాస్యాస్పదమని, నిజాన్ని భారత్ దాచాలని చూస్తోందని, పాక్ ను తక్కువ చేసి చూపించేందుకే ఐసీజేలో భారత్ పిటిషన్ వేసిందని మన్సూర్ ఆరోపించాడు. జాదవ్ నేరస్థుడే అయినా కూడా మానవతా దృక్పథంతో అతడు తన కుటుంబ సభ్యులను కలిసేందుకు తాము అనుమతిచ్చామని అన్నారు. ఇలా భారత్ ఎప్పుడైనా ఓ పాక్ ఖైదీని కలిసేందుకు అనుమతిచ్చిందా అని ప్రశ్నించారు.
భారత నావికాదళ మాజీ అధికారి అయిన కుల్ భూషణ్ జాదవ్ కు ఉగ్రవాదం,గూఢచర్యం ఆరోపణలతో 2017 ఏప్రిల్ లో పాక్ లోని మిలటరీ కోర్టు జాదవ్ కు మరణశిక్ష విధించిన విషయం తెలిసిందే. ఈ తీర్పుపై అదే ఏడాది మే-18న అంతర్జాతీయ న్యాయస్థానాన్ని భారత్ ఆశ్రయించింది. భారత తరపున మాజి సొలిసిటర్ జనరల్ హరీష్ సాల్వే సోమవారం(ఫిబ్రవర18,2019 వాదనలు వినిపించారు. తిరిగి బుధవారం(ఫిబ్రవరి-20,2019)న భారత్ స్పందించాక, గురువారం(ఫిబ్రవరి-21,2019) పాక్ తుది వాదనలు వినిపించనుంది.