నిత్యావసర వస్తువుల బిల్లుకు పార్లమెంట్ ఆమోదం : ఉల్లి, ఆలు ఇక నిత్యావసరాలు కాదు

వ్యవసాయ రంగంలో సంస్కరణల కోసం కేంద్రం తీసుకొచ్చిన మూడు బిల్లులో ఒకటైన నిత్యావసర వస్తువుల (సవరణ) బిల్లు 2020ను మంగళవారం రాజ్యసభ మూజువాణి ఓటుతో ఆమోదించింది. ఈ బిల్లును లోక్‌సభ సెప్టెంబర్ 15న ఆమోదించింది. ఈరోజు రాజ్యసభ కూడా ఆమోదించడంతో పార్లమెంటు ఆమోదాన్ని ఈ బిల్లు పొందినట్లు అయింది. ఇక రాష్ట్రపతి సంతకం తర్వాత ఈ బిల్లు చట్టంగా మారితే.. ఉల్లి, నూనెలు, పప్పులు, తృణధాన్యాలను నిత్యావసర వస్తువుల జాబితాను తొలగించవచ్చు.
.
యుద్ధం వంటి ప్రత్యేక పరిస్థితులు, అసాధారణంగా ధరలు పెరగడం వంటి సందర్భాల్లో తప్ప చిరు ధాన్యాలు, పప్పుధాన్యాలు, నూనెగింజలు, పండ్లు, కూరగాయలు సహా పలు నిత్యావసర వస్తువుల నిల్వ, సరఫరాపై ఎలాంటి నియంత్రణలూ ఉండబోవన్నది నిత్యావసర సరకుల చట్టసవరణ ప్రధానోద్దేశం.
ఈ బిల్లును రాజ్యసభ ఆమోదించే ముందు వినియోగదారుల వ్యవహారాల, ఆహార, ప్రజా పంపిణీ శాఖల మంత్రి దాన్వే రావుసాహెబ్ దాదారావు మాట్లాడుతూ .. నిల్వ సౌకర్యాలు లేకపోవడం వల్ల వ్యవసాయ ఉత్పత్తులను వృధా అవ్వకుండా నిరోధించడానికి ఈ సవరణ అవసరమని అన్నారు. ఈ సవరణ రైతులకు మాత్రమే కాకుండా వినియోగదారులకు, పెట్టుబడిదారులకు కూడా అనుకూలమైన వాతావరణాన్ని సృష్టిస్తుందని, ఖచ్చితంగా మన దేశాన్ని స్వావలంబన దిశగా మళ్లిస్తుందని ఆయన తెలిపారు. .