పార్లమెంట్ బడ్జెట్‌ సమావేశాలు సజావుగా సాగుతాయా..?

పార్లమెంట్ బడ్జెట్‌ సమావేశాలు సజావుగా సాగుతాయా..?

Updated On : January 29, 2021 / 8:47 AM IST

Parliamentary budget meetings : బడ్జెట్‌ సమావేశాలకు పార్లమెంట్ రెడీ అయింది. ఇవాళ్టి నుంచి బ‌డ్జెట్ సెషన్స్‌ ప్రారంభంకానున్నాయి. అయితే పార్లమెంట్‌ సమావేశాలపై నూతన వ్యవసాయ చట్టాల ఎఫెక్ట్‌ కనిపించింది. తొలిరోజే రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరిస్తున్నట్లు విపక్షాలు ప్రకటించాయి. నూతన వ్యవసాయ చట్టాలకు నిరసనగా 16 ప్రతిపక్ష పార్టీలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. రైతుల ఆందోళన నేపథ్యంలో.. ఈసారి బడ్జెట్‌ సమావేశాలు సజావుగా సాగుతాయా..?

పార్లమెంట్ బ‌డ్జెట్ స‌మావేశాలు శుక్రవారం నుంచి ప్రారంభంకానున్నాయి. పార్లమెంట్‌ ఉభ‌య‌స‌భ‌ల‌ను ఉద్దేశించి రాష్ట్రప‌తి రామ్‌నాథ్ కోవింద్ సెంట్రల్‌ హాల్‌లో ప్రసంగం చేయనున్నారు. బడ్జెట్‌ సమావేశాలకు తొలిరోజే విపక్షాలు షాకిచ్చాయి. రాష్ట్రపతి ప్రసంగాన్ని బాయ్‌కాట్‌ చేస్తున్నట్లు కాంగ్రెస్, ఎన్సీపీ, డీఎంకే, ఆర్జేడీ తదితర 16 ప్రతిపక్ష పార్టీలు ప్రకటించాయి. వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ విపక్షాలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. రిపబ్లిక్‌ డే రోజున చోటుచేసుకున్న ఘటనలపై దర్యాప్తు చేయించాలని, ఈ దుశ్చర్యల వెనుక అసలు కుట్రదారులు ఎవరో తేల్చాలని డిమాండ్‌ చేశాయి.

కోవిడ్‌ నిబంధనల మధ్య పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు జరగనున్నాయి. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు రాజ్యసభ, సాయంత్రం 4 నుంచి రాత్రి 9 గంటల వరకు లోక్‌సభ సమావేశాలు జరగనున్నాయి. తొలిదశ బడ్జెట్‌ సమావేశాలు ఫిబ్రవరి 15 వరకు, రెండో దశ సమావేశాలు మార్చి 8 నుంచి ఏప్రిల్ 8 వరకు కొనసాగనున్నాయి. సమావేశాల ఎజెండాను రూపొందించడానికి ఈ నెల 30న ప్రధాని నరేంద్ర మోడీ విపక్షాలతో సమావేశం కానున్నారు. ఈసారి బడ్జెట్‌ పత్రాలు డిజిటల్‌ రూపంలోనే లభించనున్నాయి. పార్లమెంట్ సభ్యులందరికి కోవిడ్‌ పరీక్షలు నిర్వహించనున్నారు.

పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు వాడివేడిగా జరిగే అవకాశం ఉంది. రైతుల ఆందోళనకు మద్దతు ప్రకటించిన విపక్షాలు- నూతన వ్యవసాయ చట్టాలపై ప్రభుత్వాన్ని నిలదీయనున్నాయి. గత సమావేశాల్లో విపక్షాల తీవ్ర అభ్యంతరాల నడుమ రాజ్యసభలో కేంద్రం ఈ బిల్లును ఆమోదింపజేసుకుంది. సరిహద్దు వివాదం, ఆర్థిక వ్యవస్థ, నిరుద్యోగం తదితర అంశాలపై విపక్షాలు కేంద్రాన్ని ఇరకాటంలో పెట్టే అవకాశం ఉంది.