సుజిత్ క్షేమంగా బయట పడాలని మోడీ ప్రార్ధన

  • Published By: chvmurthy ,Published On : October 28, 2019 / 12:35 PM IST
సుజిత్ క్షేమంగా బయట పడాలని మోడీ ప్రార్ధన

Updated On : October 28, 2019 / 12:35 PM IST

తమిళనాడులోని తిరుచ్చి జిల్లా,మనప్పారైలో  4 రోజుల క్రితం ఆడుకుంటూ బోరుబావిలో పడిపోయిన సుజిత్ క్షేమంగా బయటకు రావాలని ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రార్ధించారు. సుజిత్ ను బయటకు తీసుకు వచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సహాయక చర్యలను సీఎం పళనిస్వామిని అడిగి తెలుసుకున్నారు. 

సుజిత్ బోరుబావిలో పడ్డ అక్టోబరు 25, శుక్రవారం రాత్రి నుంచి రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి సి.విజయభాస్కర్, పర్యాటక శాఖ మంత్రి “వెల్లమండి” ఎస్ నాగరాజన్ లు సంఘటనా స్ధలంలోనే ఉండి బాలుడ్ని బయటకు తీసే కార్యక్రమాలను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. బాబు పడిపోయిన ప్రాంతం పూర్తిగా రాతి ప్రాంతం కావడంతో తవ్వడానికి ఇబ్బందులు తలెత్తున్నాయని మంత్రి విజయ్ కుమార్ తెలిపారు. దీంతో.. మరోక డ్రిల్లింగ్ మెషిన్‌ను తెప్పించి  తవ్వకం మొదలుపెట్టారు. మరో వైపు ఆదివారం రాత్రి డిప్యూటీ సీఎం పన్నీరు సెల్వం ఘటనా స్థలికి చేరుకుని సుజిత్ తల్లిదండ్రులను పరామర్శించి, వారిని ధైర్యంగా ఉండాలని చెప్పారు.

నాలుగు రోజులుగా బాలుడు బోరు బావిలో ఉండటంతో అందరి గుండెను కలిచి వేస్తోంది. ప్రతి ఒక్కరూ సుజిత్ క్షేమంగా బయటకు రావాలని వేడుకుంటున్నారు. ప్రస్తుతం సుజిత్ 100 మీటర్ల లోతులో ఉన్నట్లు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది చెపుతున్నారు. ఓన్జీసీకి చెందిన రెండు రిగ్గుల ద్వారా అక్కడ తవ్వకాలు జరిపి బాలుడిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం శాయశక్తులా కృషి చేస్తోంది. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, ఎన్డీఆర్ ఎఫ్ బృందాలతో సహా మద్రాస్ ఐఐటీకి చెందిన నిపుణుల బృందం సహాయక చర్యల్లో పాల్గోంది. బోరుబావికి సమాంతరంగా మరో బావిని తవ్వి  సుజీత్ ను బయటకు తీసుకొచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు.