2015 నుంచి 58దేశాల్లో పర్యటించిన మోడీ..ఖర్చు ఎంతంటే

2015 నుంచి భారత ప్రధాని నరేంద్ర మోడీ 58 దేశాల్లో పర్యటించారని కేంద్రం తెలిపింది. ఈ పర్యటనలకు రూ.517.18 కోట్లు ఖర్చు అయినట్లు రాజ్యసభకు వెల్లడించింది. మోదీ చేపట్టిన పర్యటనలు, వాటి ఫలితాలపై సభ్యులు అడిగిన ప్రశ్నకు విదేశాంగ సహాయ మంత్రి వీ మురళీధరన్ ఈ మేరకు లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు.
వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతికత, రక్షణ రంగ సహకారం, ప్రజల మధ్య సంబంధాలతో పాటు ఆయా దేశాలతో భారత సంబంధాలు పెంపొందించడానికి ప్రధాని పర్యటనలు దోహదం చేశాయని చెప్పారు. అత్యధికంగా అమెరికా, రష్యా, చైనా దేశాల్లో ఐదేసి సార్లు మోడీ పర్యటించినట్లు తెలిపారు.
సింగపూర్, ఫ్రాన్స్, శ్రీలంక, యూఏఈ వంటి దేశాలకు ఒకటికంటే ఎక్కువసార్లు వెళ్లారు. ఆయా పర్యటనల్లో భాగంగా కొన్ని సార్లు ఒకటికి మించి దేశాలను చుట్టిరాగా.. మరికొన్నిసార్లు ద్వైపాక్షిక సందర్శనలు చేశారు. చివరిసారిగా మోడీ .. బ్రిక్స్ దేశాల శిఖరాగ్ర సదస్సులో హాజరయ్యేందుకు 2019 నవంబర్ 13-14 మధ్య బ్రెజిల్ కు పర్యటన నిర్వహించారు.