Union Cabinet Reshuffle : జూలై మొదటి వారంలో కేంద్ర కేబినెట్ విస్తరణ!
జూలై మొదటివారంలో కేంద్ర కేబినెట్ విస్తరణ జరగనుంది. జూలై రెండు లేదా మూడో వారంలో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరగనున్నాయి. 2019లో మంత్రివర్గం ఏర్పాటు చేసిన తర్వాత మొదటిసారి ఈ కేబినెట్ విస్తరణ జరగనుంది.

Pm Narendra Modi Readies For Cabinet Reshuffle In Early July
Union Cabinet Reshuffle : జూలై మొదటివారంలో కేంద్ర కేబినెట్ విస్తరణ జరగనుంది. జూలై రెండు లేదా మూడో వారంలో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరగనున్నాయి. యూపీ పర్యటన ముగించుకుని రాష్ట్రపతి రామ్ నాథ కోవింద్ బుధవారం (జూన్ 30) ఢిల్లీ చేరుకోనున్నారు. రాష్ట్రపతి ఢిల్లీ రాగానే కేబినెట్ విస్తరణకు సంబంధించి సమాచారం ప్రధాని కార్యాలయం అందించనుంది. ఇప్పటికే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ కసరత్తును ప్రధాని మోడీ, అమిత్ షా, జెపి నడ్డా పూర్తి చేశారు. కొత్తగా మంత్రివర్గంలో 20 మందికి పైగా నేతలకు స్థానం కల్పించే అవకాశం ఉన్నట్టు కనిపిస్తోంది. 2019లో మంత్రివర్గం ఏర్పాటు చేసిన తర్వాత మొదటిసారి ఈ కేబినెట్ విస్తరణ జరగనుంది.
ఇటీవలి కాలంలో కేబినెట్ మంత్రులు ఉన్న రాంవిలాస్ పాశ్వాన్, సురేశ్ అంగడి మరణించడం, ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, అనేక మంది మంత్రులు ప్రస్తుతం ఒకటికి మించి శాఖల్ని నిర్వహిస్తున్న నేపథ్యంలో కేబినెట్ విస్తరణ చేయనున్నట్టు తెలుస్తోంది. కేబినెట్ విస్తరణలో ప్రధానంగా యూపీ, బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఢిల్లీ, ఒడిశా, బెంగాల్, కర్ణాటక, హర్యానా, లద్దాక్, గుజరాత్ రాష్ట్రాల నేతలకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్టు తెలుస్తోంది.
కేబినెట్ రేసులో ఉన్న పలువురు నేతల్లో కాంగ్రెస్ మాజీ నేత జ్యోతిరాదిత్య సింధియా, బిహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి సుశీల్ మోదీ, అసోం మాజీ ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్, మహారాష్ట్ర మాజీ సీఎం నారాయణ్ రాణే, భూపేందర్ యాదవ్ , కైలాశ్ విజయవర్గీయ (ఈ ఇద్దరు బీజేపీ ప్రధాన కార్యదర్శులు) ,మైనారిటీ నేత సయ్యద్ జాఫర్ ఇస్లాం, బీజేపీ యూపీ అధ్యక్షుడు స్వతంత్ర దేవ్ సింగ్ ఉన్నారు.
మరికొంతమంది నేతల్లో మేనకాగాంధీ కుమారుడు వరుణ్ గాంధీ, అప్నాదళ్ నేత అనుప్రియపాటిల్, మహారాజ్‌గంజ్ ఎంపీ పంకజ్ చౌధురి, రైల్వే మాజీ మంత్రి దినేశ్ త్రివేదీ, వైజయంతీ పాండా,అశ్వనీ వైష్ణవ్ (ఈ ఇద్దరు ఒడిసా ఎంపీలు), ఢిల్లీ ఎంపీ మీనాక్షీలేఖీ, రాజ్యసభ ఎంపీ అనీల్ జైన్ సుమేధానంద సరస్వతి, పీపీ చౌధురి, రాహుల్ కాశ్వాన్ (ఈ ముగ్గురు రాజస్థాన్ నేతలు), లోక్ జనశక్తి నేత పశుపతి పారస్ ఆర్‌సీపీ సింగ్, సంతోశ్ కుమార్ (ఈ ఇద్దరు జేడీయూ నేతలు), కర్ణాటక ఎంపీ రాజీవ్ చంద్రశేఖర్ , గుజరాత్ బీజేపీ అధ్యక్షుడు సీఆర్ పాటిల్, అహ్మదాబాద్ వెస్ట్ ఎంపీ కిరీట్ సోలంకి , పహ్యానా ఎంపీ సునీతా దుగ్గల్, లద్దాఖ్ ఎంపీ నంగ్యాల్ తదితరులు ఉన్నారు.